పాకిస్థాన్‌తో భారత్ ఆడట్లేదు.. మ్యాచ్ పాయింట్లలో ఐసీసీ కోత.. బీసీసీఐ సీరియస్

బుధవారం, 23 నవంబరు 2016 (16:58 IST)
ముంబై పేలుళ్ల అనంతరం టీమిండియా పాకిస్థాన్‌తో క్రికెట్ సిరీస్ ఆడలేదు. ప్రపంచ కప్ మ్యాచ్ మినహాయించి.. పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు భారత్ ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ, బీసీసీఐ మధ్య సంబంధాలు మరోసారి దిగజారాయి. పురుషుల క్రికెట్ జట్టు పాకిస్థాన్‌తో కలిసి ఆడే ఛాన్సులు లేకపోవడంతో.. ఇక మహిళల జట్టును ఐసీసీ టార్గెట్ చేసింది. ఈ క్రమంలో ఐసీసీ ఒప్పందం ప్రకారం ఆగస్టు 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడలేదని భారత మహిళల క్రికెట్‌ జట్టుకు ఐసీసీ సాంకేతిక బృందం మ్యాచ్‌ పాయింట్ల కోత విధించింది.   
 
మొత్తం 3 మ్యాచ్‌లకు 2 పాయింట్ల చొప్పున 6 పాయింట్ల కోసింది. 50 ఓవర్లకు సున్నా పరుగుల ప్రకారం రన్‌రేట్‌ను సవరిస్తామని వెల్లడించింది. పాక్‌తో ఆడకపోవడానికి బీసీసీఐ సరైన కారణాలు చూపలేదని సాంకేతిక బృందం పేర్కొంది. అయితే మ్యాచ్ పాయింట్ల కోతపై బీసీసీఐ ఫైర్ అయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ ఆడాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని.. ఈ విషయం ఐసీసీ ఛైర్మన్‌కు బాగా తెలుసునని బీసీసీఐ స్పందించింది.  
 
పాకిస్థాన్ దాడుల్లో భారత సైనికులు అమరులవుతున్న సంగతి ఐసీసీకి బాగా తెలుసు. అంతేగాకుండా పాకిస్థాన్ క్రికెట్ ఆడాలనే కోరిక చనిపోయింది. తమకు ప్రభుత్వం అనుమతి ఇస్తేనే పాక్‌తో ఆడేందుకు వీలుంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐసీసీ తిరిగి సరైన బాటలో నడవకుంటే పురుషులతో పాటు మహిళల జట్టూ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడదని' బీసీసీఐ హెచ్చరించింది.

వెబ్దునియా పై చదవండి