సౌతాఫ్రికా చేతిలో న్యూజిలాండ్ చిత్తు... పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవం

గురువారం, 2 నవంబరు 2023 (12:27 IST)
భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో పాల్గొన్న పాకిస్థాన్ జట్టు చెత్త ప్రదర్శనతో విమర్శలపాలైంది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత గెలుపుబాట పట్టింది. దీంతో పాకిస్థాన్ జట్టు ఈ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినట్టేనని అందరూ భావించారు. కానీ, ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం సౌతాఫ్రికా - న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక పోరు జరిగింది. ఇందులో కివీస్ జట్టు 190 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అదేసమయంలో సౌతాఫ్రికా జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో భారత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. ఆ తర్వాత భారత్ ఆరు మ్యాచ్‌‌లు ఆడి ఒక్క ఓటమి కూడా లేకుండా 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 
 
అయితే, కివీస్, సఫారీల మ్యాచ్ ఫలితంతో బాబర్ ఆజమ్ నేతృత్వంలోని ఆ జట్టుకు పరిస్థితులు కొద్దిగా సానుకూలంగా మారినట్టుగా ఉన్నాయి. బుధవారం రాత్రి దక్షిణాఫ్రికా చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవడం పాక్‌కు సానుకూలంగా మారింది. ఆ జట్టు సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. దక్షిణాఫ్రికా చేతిలో 190 పరుగుల భారీ ఓటమిని చవిచూసిన న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది.
 
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా, భారత్ చెరో 12 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా 3వ స్థానంలో(8 పాయింట్లు, రన్‌రేట్ 0.970) ఉండగా న్యూజిలాండ్ 8 పాయింట్లు, 0.484 రన్‌రేట్‌తో నాలుగవ స్థానంలో నిలిచింది. కాగా 6 పాయింట్లతో (-0.024 రన్‌రేట్) పాకిస్థాన్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్థాన్ 6వ స్థానంలో (6 పాయింట్లు, -0.718 రన్‌రేట్) ఉంది. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో తన తర్వాత స్థానాల్లో ఉన్న జట్ల కంటే కేవలం 2 పాయింట్లు మాత్రమే ఎక్కువ కలిగివుంది. కాబట్టి ఆ జట్టుకు పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో పాకిస్థాన్ అవకాశాలు మెరుగయ్యాయి.
 
పాకిస్థాన్ తన తర్వాతి రెండు మ్యాచ్‌లు న్యూజిలాండ్, ఇంగ్లండ్లపై ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటే టాప్-4లో అడుగుపెట్టే అవకాశం లేకపోలేదు. టెక్నికల్‌గా చూస్తే ఆఫ్ఘనిస్థాన్, 7వ స్థానంలో ఉన్న శ్రీలంకలకు కూడా ఇంకా సెమీస్ అవకాశాలు మిగిలే ఉన్నాయి. మరి సెమీస్‌కు చేరుకునే జట్లు ఏవో, మరికొన్ని మ్యాచ్‌‌లు జరిగితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు