ఢిల్లీ టెస్ట్ : భారత్ గెలుపును అడ్డుకున్న ధనంజయ .. టెస్ట్ డ్రా

బుధవారం, 6 డిశెంబరు 2017 (17:06 IST)
ఢిల్లీ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత విజయాన్ని లంక ఆటగాడు ధనంజయ అడ్డుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు అడ్డుగోడలా నిలిచి టెస్టును డ్రా చేశాడు. ఫలితంగా మూడు టెస్ట్ మ్యాచ్‌లో సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 
 
నిజానికీ మూడో టెస్ట్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. తొలి ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 536 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఆ లీడ్ చేధించేందుకు లంక బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకే లంక ఆలౌట్ అవ్వడంతో భారత్ 163 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. 
 
కాగా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారత్ 410 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందుంచింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఆ టార్గెట్ చేధించే క్రమంలో సీనియర్ ఆటగాళ్లు తడబడిన యువ ఆటగాళ్లు.. ధనుంజయ(119), రోషన్(74), డిక్‌వెలా(44) జట్టుకు బాసటగా నిలిచారు. భారత స్పిన్ ధాటికి ఎదురుగా నిలబడి.. తమ వికెట్లు కాపాడుకుంటూ మ్యాచ్‌ను డ్రా దిశగా నడిపించారు. 
 
చివరి రోజైన బుధవారం 31/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక ఈ రోజు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. భారత్ ఆటగాళ్లు పలు క్యాచ్‌లు, రన్‌ఔట్‌లు చేజార్చుకొని ఫీల్డింగ్‌లో తీవ్రస్థాయిలో విఫలమయ్యారు. దీంతో గెలుపు ఇద్దరి మధ్యా దోబూచులాడింది. తొలి రెండు సెషన్‌లలో భారత్‌దే గెలుపుగా అందరూ భావించారు. అయితే శ్రీలంక బ్యాట్స్‌మెన్ ధనంజయ డిసిల్వ క్రీజులో నిలదొక్కుకోవడంతో భారత్‌కు విజయం దూరమైంది. 119 పరుగులతో అజేయంగా నిలిచినప్పటికీ గాయం కారణంగా రిటైర్డ్ హట్‌గా వెనుదిరిగాడు. 
 
ఒకవైపు వికెట్లు తీసేందుకు టీమిండియా తీవ్రంగా శ్రమిస్తుంటే.. మరోవైపు లంక క్రికెటర్లు క్రీజులో పాతుకుపోయారు. బౌలర్లు ఎంతగా కష్టపడ్డా ఫలితం మాత్రం కనిపించ లేదు. 103 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయిన రోషన్‌ సిల్వా (74)కు నిరోషన్‌ డిక్వెలా (44) తోడుగా నిలిచాడు. ఇద్దరూ దూకుడుగా ఆడటంతో మ్యాచ్ టీమిండియాకు దూరమైంది. అయితే మూడు టెస్టుల సిరీస్ లో 1 – 0 సిరీస్ సొంతం చేసుకుంది కోహ్లీ సేన. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీసుకోగా.. షమి, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు. 
 
సంక్షిప్త స్కోరు 
భారత్ తొలి ఇన్నింగ్స్ 536/7 డిక్లేర్డ్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 373 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ 246/5 డిక్లర్డ్
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 299/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు