అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ను ఏకాకి చేద్ధాం : ఎహ్‌సాన్ మణి

గురువారం, 6 అక్టోబరు 2016 (09:13 IST)
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ను ఏకాకి చేద్దామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడైన ఎహ్‌సాన్ మణి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు పిలుపునిచ్చాడు. పాక్‌తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని, క్రికెట్‌లో అయినా మరోచోటైనా భారత్‌దే విజయమన్న బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్‌‌తో పాటు.. మణి కూడా వ్యాఖ్యలను తిప్పికొట్టారు. 
 
ఇదే అంశంపై మాట్లాడుతూ అనురాగ్ ఠాకూర్‌వి పరిపక్వత లేని వ్యాఖ్యలని, రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు. ఐసీసీకి సంబంధించిన ఈవెంట్లను నిర్వహించకుండా భారత్‌ను ఏకాకిని చేసేవిధంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చూడాలని కోరారు. వచ్చేవారం కేప్‌టౌన్‌లో జరగబోయే ఐసీసీ మీటింగ్‌లో భారత్‌ను ఏకి పారేసేందుకు, భారత్‌ను బహిష్కరించేందుకు పాక్ బోర్డ్ అధికారులు సిద్ధమై రావాలన్నారు. 
 
మరోవైపు... అధికార పార్టీ నాయకుడైన అనురాగ్ ఠాకూర్ బీసీసీఐ అధ్యక్షుడిగా పాక్‌పై వ్యాఖ్యలు చేశారా, లేక పార్టీ లీడర్‌గా అన్నారా అని ఐసీసీ నిలదీసేలా పీసీబీ (పాక్ క్రికెట్ బోర్డ్) గట్టి ప్రయత్నం చేయాలని కోరారు. రూల్స్ ప్రకారం ఐసీసీకి నష్టం కలిగించే విధంగా సొంత అధికారులు గానీ, సంబంధిత మెంబర్ అధికారులు కానీ ఎటువంటి కామెంట్స్ చేయకూడదని మణి గుర్తుచేశారు.

వెబ్దునియా పై చదవండి