హైఓల్టేజ్ మ్యాచ్‌లో విఫలమైన పాక్ బ్యాటర్లు... భారత్ టార్గెట్ 148
ఆదివారం, 28 ఆగస్టు 2022 (21:36 IST)
ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో భారత బౌలర్ల దెబ్బకు పాక్ బ్యాటర్లు తలవంచారు. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 19.5 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి పాకిస్థాన్ జట్టు 147 పరుగులు చేసింది.
పాక్ ఆటగాళ్లలో ఓపెనర్‌గా దిగిన రిజ్వాన్ 43, బాబర్ అజమ్ 11, ఫక్తర్ జమాన్ 10, ఇఫ్తీకర్ అహ్మద్ 28, ఖుషిదిల్ షా 2, షదబ్ ఖాన్ 10, అసిఫ్ అలీ 9, మహ్మద్ నవాజ్ 1, హరీస్ రౌఫ్ 13, నజీం షా 0, షహ్‌నవాజ్ దహానీ 16 చొప్పున పరుగులు చేయగా, అదనంగా 5 పరుగులు వచ్చాయి. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4, హార్దిక్ పాండ్యా 3, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఆ తర్వాత 148 పరుగుల విజయలక్ష్యంతో భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది.
అంతకుముందు టాస్ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ, టాస్ కీలకమని తాము భావించడంలేదని, నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు ఈ మ్యాచ్ బరిలో దిగుతున్నామన్నాడు. గతంలో ఇక్కడ జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లలో రాణించామని, పిచ్ సహకరిస్తుందని ఆశిస్తున్నామన్నాడు. ఈ మ్యాచ్‌కు రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడం బాధాకరమన్నాడు.
అలాగే, పాకిస్థాన్ సారథి బాబర్ అజామ్ మాట్లాడుతూ, తాము టాస్ గెలిచినా గానీ మొదట బౌలింగే తీసుకునేవాళ్లమని వెల్లడించాడు. ఇప్పుడు తాము మొదట బ్యాటింగ్ చేస్తున్నందున భారీ స్కోరు సాధించడంపై దృష్టి సారిస్తామన్నాడు.
ఈ మ్యాచ్ కోసం తాము ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతున్నామని వివరించాడు. ఈ మ్యాచ్ ద్వారా యువ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా టీ20 అరంగేట్రం చేస్తున్నాడని బాబర్ అజామ్ వెల్లడించాడు.