చాంపియన్స్ ట్రోఫీ : క్రికెట్ జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా

ఠాగూర్

సోమవారం, 13 జనవరి 2025 (13:04 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టుును ప్రకటించింది. పాకిస్థాన్ వేదికగా మరో నెల రోజుల్లో ఈ టోర్నీ ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ జరగనుంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. ఈ మెగా టోర్నీ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో శ్రీలంక టూర్‌కు దూరంగా ఉన్న ప్యాట్ కమిన్స్‌ను జట్టులోకి తీసుకొచ్చింది. అతడి నేతృత్వంలోని ఆసీస్ ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగనుంది. 
 
కమిన్స్ చాలా రోజులుగా చీలమండ సమస్యతో ఇబ్బందిపడుతున్నాడు. భారత్‌తో జరిగిన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ తర్వాత ఈ నొప్పి మళ్లీ తిరగబెట్టింది. దీంతో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు అతడికి విశ్రాంతినిచ్చారు. మరోవైపు ఈ నెల చివరులో కమిన్స్ సతీమణి రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో అతడి స్థానంలో శ్రీలంక సిరీసు స్టీవ్ స్మిత్‌ను ఎంపిక చేశారు. 
 
అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ ముందు కమిన్స్ గాయం ఆసీస్ అభిమానులను కలవరపెట్టింది. అతడు మెగా టోర్నీలో ఉంటాడా? లేదా? అని అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆ అనుమానాలకు తెరదించుతూ అతడి నేతృత్వంలోనే జట్టును ప్రకటించింది ఆసీస్ యాజమాన్యం. ఇక, గాయం కారణంగా ఇటీవల భారత్‌లో సిరీస్‌లో రెండు టెస్టుల్లోనే ఆడిన జోష్ హేజిల్వుడ్ తిరిగి జట్టులో చేరాడు.
 
చాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇదే.. 
 
కమిన్స్ (కెప్టెన్), అలెక్స్ కేరీ, నాథన్ ఎలిస్ , ఆరోన్ హార్డీ, జోష్ హేజెల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మ్యాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, ఆడమ్ జంపా. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు