ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కన్నీటిపర్యంతమయ్యాడు. కేరీర్‌లోనే అతిపెద్ద తప్పు చేసినట్టు అంగీకరించాడు. పైగా, ఆస్ట్రేలియా క్రికెట్ ప్రతిష్టను దిగజార్చినట్టు చెప్పాడు. ఇందుకోసం క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు.. ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆయన క్షమాపణలు చెప్పాడు.
సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు స్టీవ్ స్మిత్‌పై ఒక యేడాది నిషేధం విధించిన విషయం తెల్సిందే. దీంతో ఆయన జొహన్నెస్‌బర్గ్ నుంచి సిడ్నీకి చేరుకున్నాడు. ఆ తర్వాత సిడ్నీలో మీడియా ముందు మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టాడు. బాల్ ట్యాంపరింగ్ ఘటనతో తాను కుదేలైనట్లు చెప్పాడు.
జట్టు సభ్యులకు, క్రికెట్ అభిమానులకు, నిరుత్సాహపడ్డ ఆస్ట్రేలియన్లకు, అందరికీ సారీ అని స్మిత్ మీడియా సమావేశంలో బోరును విలపించాడు. కేప్‌టౌన్‌లో జరిగిన ట్యాంపరింగ్ ఘటన పట్ల పూర్తిగా బాధత్య తీసుకుంటున్నట్లు స్మిత్ చెప్పాడు. పరిస్థితి అంచనా వేయడంలో విఫలమయ్యానని, దాని పర్యవసానాలను అర్థం చేసుకుంటున్నానని తెలిపాడు.
ఇది నాయకత్వ విఫలమని, తాను నాయకుడిగా విఫలమైనట్లు స్మిత్ చెప్పాడు. తన తప్పు నుంచి తాను ఖచ్చితంగా నేర్చుకుంటానని, ఇది ఇతరులకు ఓ గుణపాఠంగా మారుతుందన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన తల్లితండ్రులను చూడటం ఇబ్బందికరంగా ఉందని, మంచి వ్యక్తులు తప్పులు చేస్తుంటారని, కానీ తాను ఓ పెద్ద తప్పు చేసినట్లు స్మిత్ అంగీకరించాడు. దీని పట్ల క్షమాపణలు కోరుతున్నట్లు స్మిత్ తెలిపాడు.