భారత క్రికెటర్ల వీరకుమ్ముడు... ర్యాంకులన్నీ మనవే...

మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (07:57 IST)
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనలో భారత క్రికెట్ జట్టులోని సభ్యులంతా అద్భుతంగా రాణించారు. వీరి వీరకుమ్ముడు ఫలితంగా ఈ రెండు దేశాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవని జట్టుగా ఉన్న ముద్రను కోహ్లీ సేన చేరిపేసుకుంది. అలాగే, కివీస్ గడ్డపై దశాబ్దకాలంగా ఊరిస్తూ వచ్చిన వన్డే సిరీస్‌ విజయాన్ని భారత్ కుర్రాళ్లు అందుకున్నారు. దీనికంతటికీ ఏకైక కారణంగా బ్యాటింగ్, బౌలింగ్, విభాగాల్లో టీమిండియా కుర్రోళ్లు అద్భుతంగా రాణించడమే. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన వన్డే ర్యాంకుల పట్టికలో అటు జట్టు ర్యాంకుతో పాటు.. ఆటగాళ్ళ వ్యక్తిగత ర్యాంకులు కూడా మెరుగుపడ్డాయి. 
 
ఇకపోతే, భారత జట్టు ఏకంగా రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై సిరీస్‌ విజయాలు సాధించిన దరిమిలా 122 పా యింట్లతో టీమిండియా మూడు నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌ (126) అగ్రస్థానంలో నిలిచింది. 
 
అలాగే, బ్యాట్స్‌మెన్లు, బౌలర్ల విషయానికి వస్తే కెప్టెన్‌ కోహ్లీ, బుమ్రా తమ అగ్రస్థానాలను నిలబెట్టుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 887 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఓపెనర్ రోహిత్‌ శర్మ (854) రెండో ర్యాంకులో ఉండగా, ధోనీ (688) మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 17వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 
 
ఇకపోతే, హైదరాబాద్ కుర్రోడు అంబటి రాయుడు (574) 42వ స్థానంలో నిలిచాడు. వెల్లింగ్టన్ వేదికగా కివీస్ జట్టుతో జరిగిన ఐదో వన్డేలో రాయుడు దెబ్బకు కివీస్ పక్షులు కకావికలమై పోయాయి. ఫలితంగా ఈ మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. 
 
ఇకపోతే, బౌలర్లలో బుమ్రా (808) అగ్రస్థానంలోనే నిలవగా, కుల్దీప్‌ యాదవ్‌ (719) రెండో ర్యాంకులో ఉన్నాడు. లెగ్‌స్పిన్నర్‌ చాహల్‌ (709) ఒకస్థానం ఎగబాకి ఐదో ర్యాంక్‌ చేజిక్కించుకున్నాడు. పేసర్‌ భువనేశ్వర్‌ ఏడు స్థానాలు మెరుగుపరుచుకొని 17వ ర్యాంక్‌ దక్కించుకున్నాడు. ఇలా, ఐసీసీ తాజా ర్యాంకుల పట్టికలో టాప్ 20లో 8 మంది భారత క్రికెటర్లే ఉండటం గమనార్హం. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు