వన్డే ప్రపంచ కప్ : భారత్ 240 రన్స్.. ఆసీస్ టార్గెట్ 241 రన్స్ - సెంటిమెంట్ పనిచేసేనా?

ఆదివారం, 19 నవంబరు 2023 (18:03 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పోటీలో భారత్ తొలుత బ్యాటింగ్ చేసిన 240 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా ముంగిట 241 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అహ్మదాబాద్‌ నగరంలోన నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేపట్టింది. అయితే, ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ టోర్నీ మొత్తంలో మంచి ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్ శుభమన్ గిల్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌లు తక్కువ స్కోరుకే ఔట్ అయ్యారు. 
 
వీరిద్దరూ కేవలం 4, 6 చొప్పున పరుగులు మాత్రమే చేశారు. మరోవైపు రోహిత్ శర్మ కూడా మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఫలితంగా 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 63 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 54 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 107 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 66 పరుగులు చేశాడు. 
 
రవీంద్ర జడేజా 9, సూర్యకుమార్ యాదవ్ 15, షమి 6, జస్ప్రీత్ బుమ్రా 1, కుల్దీప్ యాదవ్ 5 చొప్పున పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, కమిన్స్ 2, హేజల్‌వుడ్, మ్యాక్స్‌వెల్, జంపాలు ఒక్కో వికెట్ తీశారు. మొతేరా పిచ్ ఏమాత్రం బ్యాటింగ్‌కు అనుకూలించకపోవడంతో భారత బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమించాల్సివచ్చింది. చివరకు నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులు చేసి అన్ని వికెట్లను కోల్పోయింది. 
 
ఇదిలావుంటే, దేశం మొత్తం ఈ మ్యాచ్‌ ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ఓ సెంటిమెంట్‌ భారత్‌కు అనుకూలంగా వచ్చింది. అది ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడటమే. అదెలా అంటే..! 13వ ఎడిషన్‌గా జరుగుతున్న వన్డే వరల్డ్‌ కప్‌లో భారత్‌కు ఇది నాలుగో ఫైనల్‌. 1983, 2003, 2011, 2023లలో టీమిండియా ఫైనల్‌  చేరింది. ఈ నాలుగు పర్యాయాలలో భారత క్రికెట్ జట్టు రెండుసార్లు టీమిండియా టాస్‌ ఓడినా కప్‌ను సొంతం చేసుకుంది. 
 
భారత్‌ తొలిసారి వరల్డ్‌ కప్‌ గెలిచిన 1983లో కపిల్‌ సేన తొలుత టాస్‌ ఓడింది. కానీ ఫైనల్‌లో నాటి అరవీర భయంకర విండీస్‌ను ఓడించింది. అలాగే, 2003లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. అదేవిధంగా 2011లో టాస్ ఓడిన భారత్ .. శ్రీలంకను చిత్తు చేసి విజేతగా నిలిచింది. ఇపుడు కూడా భారత్ టాస్ ఓడింది. ఫలితం ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు