భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య మరోమారు యుద్ధం జరిగే అవకాశం ఉందని, ఆ యుద్ధంలో తామే గెలుస్తామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ జోస్యం చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తమకు అనుకూల ఫలితాలు ఉంటాయన్నారు.
ఇరు దేశాల మధ్య ముప్పు పొంచివున్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు. ఒకవేళ యుద్ధం జరిగితే గతంలో కంటే మెరుగైన ఫలితాలు పాకిస్థాన్ సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. పాకిస్థాన్‌లో ప్రజలంతా ఒకరితో ఒకరు వాదించుకున్నా, విభేదాలు ఉన్నా భారత్‌తో యుద్ధం వస్తే మాత్రం ఐక్యంగా ఉంటామని ఆయన అన్నారు. చరిత్రను పరిశీలిస్తే భారత్ ఎపుడూ ఒక దేశంగా లేదని ఆయన చెప్పుకొచ్చారు.
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ను భారత్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గట్టిగా హెచ్చరించిన విషయం తెల్సిందే. భారత్ పూర్తి సన్నద్ధంగా ఉంది, ఆపరేషన్ సిందూర్ 2.0 జరిగితే పాకిస్థాన్‌ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేలా పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ పై విధంగా కామెంట్స్ చేశారు.