ఆఖరి రోజు ఆట ప్రారంభమయ్యేసరికి ఇంగ్లండ్ విజయానికి కేవలం 35 పరుగులు మాత్రమే అవసరం కాగా, చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. దీంతో ఇంగ్లండ్ విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ, కెప్టెన్ శుభమన్ గిల్ నేతృత్వంలోని భారత బౌలర్లు అసాధారణ పట్టుదలతో ఆతిథ్య జట్టును కట్టడి చేశారు. ఉదయం సెషన్‌లో సిరాజ్ తన అద్భుత బౌలింగ్ స్పెల్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
తన బౌలింగ్‌లో ముందుగా జేమీ స్మిత్‌ను ఔట్ చేసిన సిరాజ్, ఆ కాసేపటికే జేమీ ఓవర్టన్‌ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. ఇక ప్రసిధ్ కృష్ణ వంతు వచ్చింది. గంటకు 141 కిలోమీటర్ల వేగంతో అతను సంధించిన ఒక కళ్లు చెదిరే యార్కర్‌తో జోష్ టంగ్ మిడిల్ స్టంప్ గాల్లోకి లేచింది. దీంతో భారత శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. సులభంగా గెలుస్తుందనుకున్న ఇంగ్లండ్, 347/6 నుంచి 354/9కి కుప్పకూలింది. విజయానికి ఇంకా 20 పరుగులు అవసరమైన దశలో, భుజానికి గాయమైనా క్రిస్ వోక్స్ పట్టుదలతో క్రీజులోకి వచ్చాడు.
అయితే, చివరి వికెట్‌ను కూడా సిరాజే పడగొట్టాడు. గస్ అట్కిన్సన్ (17) బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి కీపర్ ధ్రువ్ జురెల్ చేతుల్లో పడటంతో, భారత జట్టు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. సిరాజ్ మొత్తం 5 వికెట్లు తీయగా, ప్రసిద్ కృష్ణ 4 వికెట్లతో రాణించాడు. అంతకుముందు, భారత్ తొలి ఇన్నింగ్స్ 224, రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో 396 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247, రెండో ఇన్నింగ్స్ 367 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్లు లేకపోయినా యువ జట్టు సాధించిన ఈ విజయం సిరీస్ హైలెట్‌గా నిలిచింది.