వాంఖేడ్‌ స్టేడియంలో సెంచరీల మోత.. కివీస్ ఎదుట భారీ విజయలక్ష్యం

బుధవారం, 15 నవంబరు 2023 (18:14 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ తొలి సెమీస్ మ్యాచ్ బుధవారం ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరుగుతుంది. ఈ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత క్రికెటర్లు పరుగుల వరద పారించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్, ఓపెనర్ శుభమన్ గిల్‌లు అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలో కోహ్లీ వన్డేల్లో తన 50వ సెంచరీని పూర్తి చేసుకోగా, శ్రేయాస్ అయ్యర్ కూడా వరుసగా రెండో సెంచరీ చేశాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 భారీ స్కోరు చేసింది. దీంతో కివీస్ ముంగిట 398 భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ 29 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 47 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ గిల్ 66 బంతుల్లో 80 పరుగులు చేయగా, ఇందులో మూడు సిక్స్‌లు, 8 ఫోర్లు ఉన్నాయి. అయితే, తొడ కండరాలు పట్టేయడంతో గిల్ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఈ పరిస్థితుల్లో కోహ్లీతో జతకలిసిన శ్రేయాస్ అయ్యార్ క్రీజ్‌లో నిలదొక్కుకున్న తర్వాత పరుగుల వరద పారించారు. వీరిద్దరి దెబ్బకు స్కోరు బోర్డు జెట్ స్పీడ్ వేగంతో ముందుకు సాగింది.
 
విరాట్ కోహ్లీ 113 బంతుల్లో రెండు సిక్స్‌లు 9 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ 70 బంతుల్లో 8 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 105 పరుగులు చేసింది. అలాగే, కేఎల్ రాహుల్ కూడా 20 బంతుల్లో రెండు సిక్స్‌లు, 5 ఫోర్ల సాయంతో 39 రన్స్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఒక్క పరుగు చేసి ఔట్ అయ్యాడు. కివీస్ బౌలర్లలో సౌథీ మూడు వికెట్లు తీయగా, బౌల్ట్ ఒక వికెట్ తీశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు