మహిళల టీ-20 ప్రపంచకప్.. హ్యాట్రిక్ కొట్టి సెమీఫైనల్లోకి ఎంట్రీ

గురువారం, 27 ఫిబ్రవరి 2020 (14:32 IST)
Team India
మహిళల ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో టీమిండియా అమ్మాయిలు అదరగొట్టారు. మెల్‌బోర్న్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో లీగ్ టీ20లో 4 పరుగుల తేడాతో టీమిండియా అద్భుత విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టింది. దీంతో భారత్‌ సెమీస్‌కు చేరింది. ఫలితంగా వరుసగా మూడు విజయాలను తన ఖాతాలో చేర్చుకుంది.. టీమిండియా అమ్మాయిల జట్టు. 
 
కాగా, టీమిండియా నుంచి షెఫాలీ వర్మ 46 పరుగులు చేసింది. ఇదే జట్టుకు విజయాన్ని సంపాదించి పెట్టింది. ఆమెకే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. అలాగే  తానియా భాటియా 23 పరుగులు చేసింది. బౌలర్లలో దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరీ గైక్వాడ్‌, పూనమ్‌ యాదవ్‌, రాధా యాదవ్‌లకు తలా ఒక వికెట్‌ దక్కింది.
 
ఇకపోతే.. 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది. అమెలియా కెర్ర్‌ (34; 18 బంతుల్లో 6x4) ఇన్నింగ్స్ చివరలో ధాటిగా ఆడినా కివీస్‌ గెలుపొందలేదు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. 134 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్‌ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో కివీస్‌ ఓపెనర్లను కోలుకోనివ్వలేదు. దీంతో వెంట వెంటనే కివీస్ ఉమెన్ పెవిలియన్ చేరారు. దీంతో కివీస్‌కు ఓటమి తప్పలేదు.
 
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. స్మృతి మందాన (11), హార్మన్‌ప్రీత్‌ కౌర్‌(1) విఫలమైనా.. యువ సంచలనం షెఫాలీ వర్మ 46 పరుగులతో రాణించింది. తానియా భాటియా (23) విలువైన పరుగులు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు