కోహ్లి సెంచరీ వృధా... పేక మేడలా కూలిన వికెట్లు... ఆసీస్ విజయం

శుక్రవారం, 8 మార్చి 2019 (21:21 IST)
కోహ్లీ చేసిన సెంచరీ వృధా అయింది. భారత్ బ్యాట్సమన్ల వికెట్లు పేకమేడలా కూలిపోవడంతో ఆసీస్ 32 పరుగుల తేడాతో భారత్ పైన మూడో వన్డేలో విజయం సాధించింది. 314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదిలోనే తడబడింది. 
 
ధావన్ కేవలం 1 పరుగు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా ఎంతోసేపు నిలువలేకపోయాడు. అతడు 14 పరుగుల వద్ద ఔటయ్యాడు. విరాట్ కోహ్లి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. విరాట్ కోహ్లి దూకుడుగా ఆడటం చూసి ఇక ఇండియా గెలుపు ఈజీనే అనుకున్నారు. ఐతే వచ్చినవారు వచ్చినట్లు వికెట్లు సమర్పించుకుంటూ వెళ్తుండటంతో భారత్ విజయావకాశాలు ఆవిరయ్యాయి. రాయుడు 2 పరుగులు, ధోనీ 26 పరుగులు, జాదవ్ 26 పరుగులు చేసి అవుటయ్యారు. 
 
కోహ్లి కూడా 38వ ఓవర్లో తన వికెట్ సమర్పించుకున్నాడు. కోహ్లి 123 పరుగులు చేయడంతో భారత్ జట్టు ఆ స్థితిలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఐతే ఆ తర్వాత వచ్చినవారు నిలకడగా రాణించలేకపోయారు. శంకర్ 32 పరుగులు, జడేజా 24 పరుగులు, కులదీప్ యాదవ్ 10 పరుగులు, మహ్మద్ సామి 8 పరుగులు చేశారు. మొత్తం 281 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీనితో ఆసీస్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు