భారత్‌-ఇంగ్లాండ్‌ మ్యాచ్‌కు నిబంధనలు ఎందుకు మారాయి..?

వరుణ్

బుధవారం, 26 జూన్ 2024 (13:17 IST)
India vs England Semi-Final
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, భారత్‌ - ఇంగ్లండ్‌ జట్లు రెండో సెమీస్‌లో గురువారమే రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం) గయానా వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే లేదు. కానీ, ఒకే రోజు ఏకంగా 250 నిమిషాల అదనపు సమయం కేటాయించారు. 
 
రిజర్వ్‌ డే ఎందుకు లేదన్న అంశంపై ఐసీసీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, ప్లేయింగ్‌ కండీషన్లను టోర్నమెంట్‌కు కొన్ని నెలల ముందే ప్రకటించారు. భారత్‌ ఒకవేళ సెమీస్‌కు చేరితే.. సూపర్‌-8 స్టాండింగ్స్‌తో సంబంధం లేకుండా ఆ జట్టు గయానాలో ఆడుతుందని అప్పట్లోనే తేల్చారు. 
 
ఎందుకంటే పగలు (విండీస్‌ కాలమానం ప్రకారం) జరిగే ఈ మ్యాచ్‌ను ప్రేక్షకులు సౌకర్యవంతంగా వీక్షించేలా ఈ నిర్ణయం తీసుకొన్నారు. తొలి సెమీస్‌ స్థానిక కాలమానం ప్రకారం రాత్రి వేళ జరుగుతుంది. గయానాలో భారత సంతతి ప్రజలు చాలా ఎక్కువ. 
 
మనకు రిజర్వ్‌డే లేకపోవడానికి సమయమే ప్రధాన కారణం. తొలి సెమీస్‌ దక్షిణాఫ్రికా - ఆఫ్గాన్‌ మధ్య స్థానిక కాలమానం ప్రకారం జూన్‌ 26 రాత్రి 8.30కి మొదలవుతుంది. అంటే భారత కాలమానం ప్రకారం జూన్‌ 27 ఉదయం 6 గంటలు. ఇక రెండో సెమీస్‌ ఇంగ్లండ్‌ - భారత్‌ మధ్య లోకల్‌ టైమ్‌ ప్రకారం జూన్‌ 27 ఉదయం 10.30కి మొదలవుతుంది. ఇక దీనిని మన కాలమానంలో చూస్తే జూన్‌ 27 రాత్రి 8 గంటలు. విండీస్‌ టైమ్‌ ప్రకారం జూన్‌ 29వ తేదీ ఉదయం 10.30 ఫైనల్స్ మొదలవుతాయి. 
 
అంటే రెండో సెమీస్‌కు రిజర్వ్‌ డే కేటాయిస్తే.. ఫైనల్స్‌ ఆడటానికి అందులోని విజేత జట్టుకు కనీసం 24 గంటల సమయం కూడా ఉండదన్నమాట. ఈ కారణంతోనే రిజర్వ్‌డేను వీరికి ఎత్తేశారు. ఒకేరోజు అదనంగా 250 నిమిషాలు కేటాయించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు