ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే!!

శనివారం, 19 జూన్ 2021 (10:01 IST)
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకావాల్సివుంది. అయితే, తొలి రోజు ఆట మొత్తం వర్షం కారణంగా రద్దు అయింది. ఈ క్రమంలో భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి రోజు ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. 
 
సౌతాంప్టన్‌లో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండడంతో రోజ్‌బౌల్ స్టేడియం నీటితో నిండిపోయింది. ఫస్ట్ సెషన్ కూడా సాగకపోవడంతో భోజన విరామం ప్రకటించారు. ఆ తర్వాత వర్షం కొంత తగ్గుముఖం పట్టడంతో ఆశలు చిగురించాయి. అయితే, మైదానం మొత్తం నీటితో నిండిపోవడం, చినుకులు పడుతుండడంతో తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. 
 
శనివారం కనుక వర్షం నెమ్మదించి వాతావరణం అనుకూలిస్తే నేడు కోల్పోయిన సమయాన్ని రిజర్వు డే నాడు నిర్వహించే అవకాశం ఉంది. రేపు కూడా వరుణుడు ప్రభావం చూపితే మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే అవకాశం ఉంది. వర్షం కారణంగా దురదృష్టవశాత్తు తొలి రోజు మ్యాచ్ రద్దు అయిందని, శనివారం మామూలుగానే నిర్ణీత సమయానికి మ్యాచ్ ప్రారంభం అవుతుందని బీసీసీఐ ట్వీట్ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు