బెంగుళూరు టీ20 వర్షార్పణం : సమ ఉజ్జీలుగా భారత్ - సౌతాఫ్రికా

సోమవారం, 20 జూన్ 2022 (08:28 IST)
స్వదేశంలో పర్యాటక సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ఆఖరి మ్యాచ్ వర్షార్పణమైంది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాత్రి ఈ మ్యాచ్ జరిగింది. అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు పలుమార్లు అంతరాయం కలిగించాడు. చివరకు కేవలం 3.3 ఓవర్లకు మించి ఆటను కొనసాగించలేకపోయారు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసిన ఫీల్డ్ అంపైర్లు ఇరు జట్లను సమఉజ్జీలుగా ప్రకటించారు. 
 
మొత్తం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరు జట్లూ రెండేసి మ్యాచ్‌లలో గెలుపొంది సమఉజ్జీలుగా నిలిచాయి. తొలి రెండు మ్యాచ్‌లలో సౌతాఫ్రికా, ఆ తర్వాత  రెండు మ్యాచ్‌లలో భారత్ గెలుపొందింది. దీంతో సిరీస్ ఫలితాన్ని తేల్చే ఐదో మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దు చేశారు. సౌతాఫ్రికా టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 
 
దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 3.3 ఓవర్లలో 2 వికెట్లకు 28 పరుగులు చేసింది. ఈ క్రమంలో మరోమారు వర్షం మొదలై, చాలాసేవు కొనసాగింది. ఫలితంగా స్టేడియం మొత్తం నీటితో తడిసి ముద్దయిపోయింది. ఓవర్లు తగ్గించినప్పటికీ మ్యాచ్‌ను నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సిరీస్‌లో ఇరూ జట్లూ సమ ఉజ్జీలుగా నిలిచాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు