ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల సమక్షంలోనే చేతి మణికట్టును బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆ మహిళను పోలీసులే హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. భర్త మేనల్లుడు తనతో కొనసాగిస్తూ వచ్చిన వివాహేతర సంబంధానికి ముగింపు పలకడంతో సదరు మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు..
ఢిల్లీకి చెందిన పూజా మిశ్రా అనే మహిళ యూపీకి చెందిన లలిత్ కుమార్ మిశ్రా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరి వయసు 7, 6 యేళ్ళుగా ఉన్నాయి. ఈ క్రమంలో లలిత్ మిశ్రా తన పనికి సాయంగా ఉంటాడనే ఉద్దేశంతో తన మేనల్లుడు అలోక్ మిశ్రాను తన ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అలోక్ - పూజాల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ బంధం గత ఏడేళ్లుగా కొనసాగుతోంది. ఈ విషయం బయటపడటంతో తన మేనల్లుడుని లలిత్ కుమార్ ఇంటికి పంపించేశాడు. ఈ క్రమంలో అలోక్‌ను విడిచివుండలేక పూజ కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
భర్తను పిల్లలను వదిలేసి ప్రియుడి కోసం బరేలికి చేరుకుంది. అక్కడ అలోక్, పూజాలు దాదాపు ఏడు నెలల పాటు సహజీవనం చేశారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్థలు వచ్చాయి. దీంతో అలోక్ తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. బరేలీలో ఒంటరిగా ఉండలేక పూజా కూడా తిరిగి వచ్చింది. తనతో కలిసివుండాలంటూ అలోక్‌తో గొడవకు దిగింది. దీనికి అలోక్ అంగీకరించకపోవడంతో ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది.
పూజా మిశ్రాతో ఇక అనైతిక సంబంధాన్ని కొనసాగించలేనని పోలీసుల ఎదుటే స్పష్టం చేశాడు. ఈ మాట వినగానే పూజా మిశ్రా తట్టుకోలేక, పోలీసుల ఎదుటే బ్లేడుతో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనతో పోలీసులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులు బాధిత మహిళను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు.