విండీస్ ఆటగాళ్లలో కెప్టెన్ జాసన్ హోల్డర్ చేసిన 25 పరుగులే అత్యధికం. రోవ్‌మన్ పావెల్ 16, మార్లన్ శామ్యూల్స్ 24 పరుగులు చేశారు. మిగతా వారెవరూ పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టగా, బుమ్రా, ఖలీల్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
ఆ తర్వాత 106 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన.. కేవలం 14.5 ఓవర్లలో వికెట్ నష్టానికి లక్ష్యాన్ని అధికమించింది. ఓపెనర్ శిఖర్ ధవన్ 6 పరుగులకే ఔట్ కాగా, రోహిత్ శర్మ మరోమారు రెచ్చిపోయి ఆడాడు. ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ అర్థ సెంచరీతో అదరగొట్టాడు. మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. కెప్టెన్ కోహ్లీ 33 పరుగులు చేశాడు. ఫలితంగా కోహ్లీ సేన 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.