గీత దాటకండి.. దాటారో.. అంతే.. బుమ్రాను వాడేసుకున్న ఇండో-పాక్ ట్రాఫిక్ పోలీసులు

శనివారం, 24 జూన్ 2017 (15:56 IST)
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో నో-బాల్ విసిరిన భారత పేసర్ బుమ్రాపై ప్రస్తుతం సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. గీత దాటితే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో చూడండి... ట్రాఫిక్ రూల్స్ పాటించండంటూ బుమ్రా గీత దాటిన ఫొటోతో జైపూర్ ట్రాఫిక్ పోలీసులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. దీనిపై బుమ్రా కూడా ట్విట్టర్ ద్వారా అసహనం వ్యక్తం చేశాడు.  
 
జైపూరు పోలీసులు ట్రాఫిక్ రూల్స్ కోసం తన ఫోటోను వాడటంపై బుమ్రా ఫైర్ అయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను నోబాల్ వేస్తున్న ఫొటోను రోడ్ సేఫ్టీ ప్రచారం కోసం వాడుకోవడాన్ని బుమ్రా తప్పుబట్టాడు. గీత దాటకండి అంటూ.. బుమ్రా ఫోటోలో గీత దాటిన ఫోటోను యాడ్ చేసి.. ఇది చాలా విలువైనందంటూ.. క్యాప్షన్ పెట్టారు.
 
నోబాల్ దెబ్బకు అసలే ఆవేదనలో ఉన్న బుమ్రా... జైపూర్ పోలీసుల యాడ్ చూసి షాక్ అయ్యాడు. దేశం కోసం ఎంతో చేసే మీకు ఎలాంటి గౌరవం లభిస్తోందో దీని ద్వారా తెలుస్తోందని ట్వీట్ చేశాడు. మీరు చేసే తప్పులను తాను ఎత్తి చూపనని... వర్రీ కావద్దని అన్నాడు. మనుషులు తప్పులు చేయడం సహజమే అని చెప్పాడు. 
 
మరోవైపు, పాకిస్థాన్‌లో కూడా బుమ్రా నోబాల్ పోస్టర్లు వెలిశాయి. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ ట్రాఫిక్ పోలీసులు బుమ్రా నోబాల్ చిత్రాన్ని నగరంలోని పలు కూడళ్లలో ఏర్పాటు చేశారు. బుమ్రా గీత దాటి చేసిన తప్పిదాన్ని... మీరు జీబ్రా లైన్ దాటి చేయవద్దని ఫైసలాబాద్ ట్రాఫిక్ పోలీసులు పోస్టర్లను ఏర్పాటు చేశారు. దీనిపై బుమ్రా ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. 
 
కానీ జైపూర్ పోలీసులు మాత్రం బూమ్రా ఫోటోలు వాడుకోవడంపై స్పందించారు. అవగాహన కోసమే దాన్ని వాడుకున్నామన్నారు. తాము బుమ్రాను ఇబ్బంది పెట్టాల‌నే ఉద్దేశంతో ఆ పోస్ట‌ర్ వేయ‌లేద‌ని, ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌పై అవ‌గాహ‌న కోస‌మే వేశామ‌న్నారు. బుమ్రా సెంటిమెంట్లను, భార‌త‌ క్రికెట్‌ అభిమానుల సెంటిమెంట్లను దెబ్బ తీయాలన్న ఉద్దేశంతో తాము అలా చేయలేదని వివ‌ర‌ణ ఇచ్చారు. నిజానికి బుమ్రా అందరికీ స్ఫూర్తి, ఆదర్శమ‌ని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి