బంతి గిరగిరా తిప్పేసిన భారత బౌలర్లు.. విలవిల్లాడిన వెస్టిండీస్

శుక్రవారం, 28 జులై 2023 (09:41 IST)
ఆతిథ్య వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో భాత బౌలర్లు బంతిని తిప్పేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు కేవలం 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత భారత్ 22.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని అధికమించి గెలుపును సొంతం చేసుకుంది. 
 
ఈ వన్డే మ్యాచ్ బ్రిడ్జ్ టౌన్‌‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగింది. భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ అర్థ సెంచరీతో మెరిశాడు. కిషన్ బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 52 పరుగులు చేయగా, మరో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (7) విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 19 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 5 పరుగులు చేసి రనౌట్ కాగా, శార్దూల్ ఠాకూర్ ఒక్క పరుగుకే అవుటయ్యాడు. 
 
రవీంద్ర జడేజా (16 నాటౌట్), కెప్టెన్ రోహిత్ శర్మ (12 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. రోహిత్ శర్మ రొటీన్‌కు భిన్నంగా ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. రోహిత్ విన్నింగ్ షాట్‌గా ఫోర్ కొట్టడంతో మ్యాచ్ పూర్తయింది. విండీస్ బౌలర్లలో గుడాకేశ్ మోతీ 2 వికెట్లు, జేడెన్ సీల్స్ 1, యానిక్ కరియా 1 వికెట్ తీశారు. ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జులై 29న బ్రిడ్జ్ టౌన్‌లోనే జరగనుంది.
 
అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు భారత బౌలర్లధాటికి విలవిల్లాడిపోయింది. విండీస్‌ను 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూల్చారు. ముఖ్యంగా, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ధాటికి కరీబియన్ బ్యాట్స్ మెన్ విలవిల్లాడారు. వీరిద్దరూ పోటీలు పడి వికెట్లు తీయడంతో, విండీస్ బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. 
 
కుల్దీప్ యాదవ్ 3 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. అందులోనూ 2 మెయిడెన్ ఓవర్లున్నాయి. జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా 1, ముఖేశ్ కుమార్ 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు. 
 
విండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాయ్ హోప్ చేసిన 43 పరుగులే అత్యధికం. అలిక్ అథనేజ్ 22, ఓపెనర్ బ్రాండన్ కింగ్ 17, షిమ్రోన్ హెట్మెయర్ 11 పరుగులు చేశారు. మిగతా అంతా సింగిల్ డిజిట్ స్కోరుకు పెవిలియన్ చేరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు