ధోనీ పెర్‌పార్మెన్స్ బాగా లేకున్నా తనకు అన్ని అవకాశాలూ కల్పిస్తున్నారని, కాని ఎంతగా ఎదురు చూస్తున్నా తమకు మాత్రం టీమిండియాలో స్థానం కల్పించడం లేదని బీసీసీఐ ఎంపిక కమిటీనీ ఇష్టమొచ్చినట్లుగా నిందిస్తూ నోరు పారేసుకున్నాడు సీనియర్ బౌలర్ హర్బజన్ సింగ్. ధోనీకి నీవు పోటీయా. నీకు అంత సీన్ లేదులే భజ్జీ అంటూ ధోనీ అభిమానులు బజ్జీతో ఒక ఆట ఆడుకున్నారు.
టీమిండియా కెప్టెన్ పదవినుంచి వైదొలిగినప్పటినుంచి ధోనీని ఎవరైనా కన్నెత్తి చూసినా, తేడాగా మాట్లాడినా ధోనీ అభిమానులు ఊరుకోవడం లేదు. మాటకు మాటగా రిటార్టు ఇవ్వడం, ధోనీకి దన్నుగా నిలబడం ఇప్పుడు రివాజు అయిపోయింది. అభిమానుల దెబ్బకు ఐపీఎల్ 10 సీజన్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ యజమాని పరువే పోయిన విషయం తెలుసు.
ధోనీ అనే ఒక సాధారణ, సింపుల్ మనిషిని, కెప్టెన్ షిప్ నుంచి వైదొలిగినప్పటికీ కోట్లాది అభిమానులు అతడంటే ఎందుకంత క్రేజీ చూపుతున్నారో ఆదివారం లండన్‌లో న్యూజీలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అర్థమైంది. మెరుపువేగంతో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ గ్రాండ్ హోమ్ వికెట్‌ను గిరాటేసి కూల్‌గా నిలబడ్డ ధోనీ మైదానంలో కరెంట్ షాక్ లాంటి అనుభవాన్ని అటు బ్యాట్స్‌మన్, ఇటు ప్రేక్షకులకూ కూడా చూపిచేశాడు. వికెట్ల వెనక ఎంఎస్ ధోనీ ఉన్నాడంటే ఎంతటి విధ్వంసకర బ్యాట్స్‌మన్ అయినా క్రీజులోంచి ముందుకొచ్చి ఆడేందుకు కాస్త సంకోచిస్తాడు. అంత కచ్చితత్వంతో కీపింగ్ చేస్తాడు మహి!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లండన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ధోనీ మళ్లీ తన మాయను ప్రదర్శించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 110 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చాడు గ్రాండ్‌హోమ్. నాలుగు పరుగులు చేశాడు. స్కోర్ బోర్డు వేగం పెంచాలని జడేజా వేసిన 22.3వ బంతిని ముందుకొచ్చి ఆడాడు. అంతే.. బంతి బ్యాటును తాకకుండా మహి చేతికి చిక్కింది. ఇంకేముంది క్షణాల వ్యవధిలోనే అతడు వికెట్లను గిరాటేసి గ్రాండ్‌హోమ్‌ను పెవిలియన్‌కు పంపించాడు.
ధోనీ స్టంపింగ్‌ను చూసిన అభిమానులు ట్విటర్‌లో ఆహో.. ఒహో.. అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. మ్యాచ్‌లో టీమిండియా డ/లూ పద్ధతిలో 45 పరుగుల తేడాతో గెలిచింది. ధోనీ అద్బుత విన్యాసం చూసిన భజ్జీకి నోరు మూతపడినట్లే ఉంది. తనను టీమ్ ఇండియా ఇప్పటికీ ఎందుకు కోరుకుంటోందో ధోనీ మరోసారి ప్రపంచం ముందు ప్రదర్శించాడు మరి.