పద్మాకర్ శివాల్కర్ ఇకలేరు... 124 మ్యాచ్‌లలో 589 వికెట్లు తీసిన స్టాల్‌వార్ట్

ఠాగూర్

మంగళవారం, 4 మార్చి 2025 (08:52 IST)
దేశవాళీ క్రికెట్‌లో దేశం అందించిన అత్యుత్తమ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా పేరుగడించిన పద్మాకర్ శివాల్కర్ ఇకలేరు. ముంబైకు చెందిన ఈ స్పిన్నర్ మృతి చెందారు. ఆయన వయసు 84 యేళ్లు. రెండు దశాబ్దాలకు పైగా ముంబై జట్టుకు ఆయన ప్రాతినిథ్యం వహిచంచారు. ఈయన అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరు గడించినప్పటికీ భారత జాతీయ జట్టుకు సేవలు అందించలేకపోయారు. కారణం.. ఆ సమయంలోనే భారత జట్టుకు మరో స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ సేవలు అందిస్తుండటమే. 
 
1961-62 సీజన్‌లో 21 యేళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ కెరియర్ ప్రారంభించిన శివాల్కర్... 47 యేళ్ల వరకు అంటే 1987-88 సీజన్ వరకు ముంబై తరపున ఆడాడు. మొత్తం 124 మ్యాచ్‌లు ఆడి 589 వికెట్లు తీశాడు. 42 సార్లు ఐదు వికెట్లు, 13 సార్లు పది వికెట్లు తీసిన ఘనత ఆయన సొంతం. 1972-73 రంజీ ట్రోఫీ ఫైనల్‌లో 16 పరుగులకు ఎనిమిది వికెట్లు, 18 పరుగులకు ఐదు వికెట్లు తీశారు. 
 
తమిళనాడులో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై వరుసగా 15వ సారి టైటిల్ అందుకుంది. దేశవాళి క్రికెట్ వీరుడుగా పేరొందిన పద్మాకర్ 2016లో సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన మృతిపట్ల క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌తో పాటు పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు