ఐపీఎల్ 9: గుజరాత్ పైన 144 పరుగుల భారీ విజయం సాధించిన కోహ్లి సేన

శనివారం, 14 మే 2016 (20:03 IST)
ఐపీఎల్ సీజన్ 9లో మరో భారీ విజయం. రాయల్ ఛాలెంజర్స్ టీమ్ గుజరాత్ లయన్స్ జట్టును 104 పరుగులకే మట్టి కరిపించింది. ఏకంగా 144 భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ అభిమానులకు పండగ చేసింది. కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్‌మెన్లలో కోహ్లి, డివీలియర్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు.

బ్యాటింగ్‌లో ఇద్దరూ అదరగొట్టేశారు. ఏకంగా ఒకే ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు నమోదు చేశారు. తద్వారా పొట్టి క్రికెట్‌లో కొత్త రికార్డు నమోదైంది. పొట్టి క్రికెట్లో రికార్డులు, సృష్టించడం, తిరగరాయడం కొత్తేమీ కాకపోయినప్పటికీ రాయల్ బ్యాట్స్‌మెన్ తమ బ్యాటింగ్‌తో వీరవిహారం చేశారు. తద్వారా ట్వంటీ-20 క్రికెట్ చరిత్రలో కొత్త అద్భుతాన్ని ఆవిష్కరించారు. 
 
శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ లయన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలిసారి ఒకే ఇన్నింగ్స్‌ల్లో రెండు శతకాలు నమోదయ్యాయి. ఈ మేరకు ఛాలెంజర్స్ బ్యాట్స్‌మెన్లు విరాట్ కోహ్లీ (55 బంతుల్లో 109 పరుగులు, ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు), ఏబీ డివిలియర్స్ 52 బంతుల్లో పది ఫోర్లు, 12 సిక్సర్లతో 129 పరుగులు  సాధించి అదుర్స్ అనిపించారు. తద్వారా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఛాలెంజర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోరు చేసింది. 

వెబ్దునియా పై చదవండి