రోహిత్ శర్మ ఖాతాలో రికార్డ్.. కటక్ వన్డేలో అదరగొట్టిన భారత్ (Video)

సోమవారం, 23 డిశెంబరు 2019 (16:23 IST)
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఏకంగా ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఏడాదిలో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. విండీస్‌తో కటక్ వన్డేలో రోహిత్ 63 పరుగులు చేసి అవుటయ్యాడు. తద్వారా ఈ సీజన్‌లో మొత్తం 2442 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రికార్డు ఇంతకుముందు శ్రీలంక విధ్వంసకర ఆటగాడు సనత్ జయసూర్య పేరిట ఉంది. ఎడమచేతివాటం ఆటగాడు జయసూర్య 1997 సీజన్‌లో 2,387 పరుగులు సాధించాడు.
 
ఇంకా కటక్‌లో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 316 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన భారత్ 48.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలకు చేరింది. తొలుత రోహిత్ శర్మ (63), కేఎల్ రాహుల్ (77) పటిష్టమైన పునాది వేయగా, ఆపై కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో 85 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఓ దశలో వరుసగా వికెట్లు పడినా రవీంద్ర జడేజా (39 నాటౌట్), శార్దూల్ ఠాకూర్ (6 బంతుల్లో 17 పరుగులు) మొండిపట్టుదలతో పోరాడి టీమిండియాను గెలిపించారు.
 
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1తో చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 315 పరుగులు చేసింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు