సంచలన నిర్ణయం తీసుకున్న సచిన్ టెండూల్కర్

ఆదివారం, 9 జనవరి 2022 (12:45 IST)
మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దిగ్గజం, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగాల్సిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ నుంచి ఆయన తప్పుకున్నారు. ఈ టోర్నీ త్వరలోనే ప్రారంభంకానుంది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు సచిన్ ప్రకటించారు. 
 
కాగా, ఈ నెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఒమన్ వేదికగా ఈ టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా మహరాజ్ జట్టు తరపున సచిన్ బరిలోకి దిగాల్సివుంది. అయితే, ఈ లీగ్‌లో ఆడనని సచిన్ ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. 
 
కాగా, ఈ లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో టీమిండియాకు చెందిన మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ బరిలోకి దిగబోతున్నారు. ఈ టోర్నీలో ఇండియా మహరాజాస్ జట్టుతో పాటు ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ జట్లు పాల్గొంటున్నాయి. 
 
ఆసియా లయన్స్ తరపున ఆసియా క్రికెటర్లు ఆఫ్రిది, జయసూర్య, షోయబ్ అక్తర్, మురళీధరన్, వరల్డ్ జెయింట్ తరపున ఆసియా క్రికెటర్లు జాంటీ రోడ్స్, షేన్ వార్న్, షాన్ పొలాక్, బ్రియాన్ లారా వంటి ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు