పాక్ ఆటగాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీసిన సానియా!.. అతనితో మద్యం తాగించిందా?

మంగళవారం, 18 జూన్ 2019 (14:22 IST)
ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా, గత ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్థాన్ చిత్తుకాగా, భారత్ విజయభేరీ మోగించింది. ఇదే పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లకు శాపమైంది. ఆ జట్టు ఆటగాళ్ల పేలవ ప్రదర్శనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తీసుకున్న నిర్ణయాలు శాపంగా మారాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు పాకిస్థాన్ కోడలు, పాకిస్థాన్ క్రికెట్ జట్టు సభ్యుడైన షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జాను ఆడిపోసుకుంటున్నారు. ఆమెను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగుతోంది. 
 
అంతేనా, సానియా మీర్జా తీరును విమర్శిస్తూ పాకిస్థాన్ పత్రికల్లో కూడా ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. ఇవి సానియాతో పాటు.. ఆమె భర్త షోయబ్ మాలిక్‌కు తలనొప్పులు తెచ్చిపెట్టాయి. భారత్‌ వంటి జట్టుతో మ్యాచ్ ఆడాల్సివున్న సమయంలో షోయబ్‌ను ప్రాక్టీస్ చేయనీయ‌కుండా సానియా రెస్టారెంట్‌కు తీసుకు వెళ్లిందంటూ ఒక పాకిస్థానీ మీడియాలో కథనం ప్రసారం అయ్యింది. సానియా బ‌ల‌వంతం కార‌ణంగా రెస్టారెంట్‌లో షోయ‌బ్ జంక్‌ఫుడ్ తీసుకున్నాడ‌ని, మ‌ద్యం కూడా సేవించాడ‌ని పేర్కొంది. 
 
అంతేకాకుండా, పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్ కూడా సానియాపై ట్రోలింగ్‌కు పాల్ప‌డుతున్నారు. భారత క్రికెట్ జట్టు గెలుపు కోసమే సానియా మీర్జా మ్యాచ్ జరిగే మాంచెష్టర్‌కు వెళ్లిందనీ, పాక్ ఆటగాళ్ల మనోస్థైర్యం దెబ్బతినేలా ఆమె ప్రవర్తించిందంటూ కొందరు పాకిస్థాన్ ఆటగాళ్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాల్లో మెరిసిన పాక్ బ్యూటీ వీణా మాలిక్ సైతం సానియాను ట్విట్టర్ ద్వారా విమ‌ర్శించింది. ఈ ట్రోలింగ్ ఎక్కువైపోవ‌డంతో సానియా ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా మూసివేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు