దంచి కొట్టిన ధావన్- సెంచరీ మిస్: వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత్ గెలుపు

శనివారం, 23 జులై 2022 (09:29 IST)
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో శిఖర్ ధవన్ సేన మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేసింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్దేశించిన 309 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్.. చివరి బంతి వరకు పోరాడి 6 వికెట్ల నష్టానికి 305 పరుగులు మాత్రమే చేసి విజయానికి నాలుగు పరుగుల దూరం వద్ద నిలిచిపోయింది. 
 
చివరి ఓవర్‌లో విజయానికి 15 పరుగులు అవసరమైన వేళ 11 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అకీల్ (32), రొమారియో షెపర్డ్ (39) భారత్‌ను కంగారు పెట్టించారు. అయితే, చివరి ఓవర్ వేసిన సిరాజ్ కట్టుదిట్టంగా బంతులు విసరడంతో విజయానికి అవసరమైన పరుగులు రాబట్టుకోలేకపోయారు. 
 
విండీస్ బ్యాటర్లలో కైల్ మేయెర్స్ (75), బ్రాండన్ కింగ్ (54) అర్ధ సెంచరీలు సాధించగా, షమ్రా బ్రూక్స్ 46, కెప్టెన్ నికోలస్ పూరన్ 25 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ధావన్ 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి సెంచరీని మిస్ చేసుకున్నాడు. శుభమన్ గిల్ 64, శ్రేయాస్ అయ్యర్ 54 పరుగులు చేశారు. 
 
సూర్యకుమార్ యాదవ్ 13, సంజుశాంసన్ 12, దీపక్ హుడా 27, అక్షర్ పటేల్ 21 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్‌, మోతీ చెరో రెండు వికెట్లు తీసుకోగా, రొమారియో షెపర్డ్, అకీల్ హొసీన్ చెరో వికెట్ తీసుకున్నారు. శిఖర్ ధవన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్‌లో భాగంగా రేపు జరగనున్న రెండో వన్డేకు ఇదే మైదానం వేదిక కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు