ఐపీఎల్ 2024 టోర్నీ ముగింపు సమయం దగ్గరపడేకొద్దీ ఆయా జట్ల ఆటగాళ్ళ ఆటతీరు అద్భుతంగా సాగుతుంది. ముఖ్యంగా, పలువురు ఆటగాళ్ళు బ్యాట్‌తో రెచ్చిపోతున్నారు. బౌలర్లు బంతితో శాసిస్తున్నారు. బుధవారం రాత్రి లక్నోతో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయభేరీ మోగించింది. ప్రత్యర్థి ఉంచిన విజయలక్ష్యాన్ని కేవలం పది ఓవర్లలోనే చేధించింది.
ఈ మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు స్కోరు చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. కానీ, హైదరాబాద్ ఆటగాళ్లు మాత్రం దుమ్ములేపారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలవడమే కాకుండా లక్నో బౌలర్లను ఊచకోత కోశారు. వీరి విశ్వరూపంతో ఉప్పల్ స్టేడియం బౌండరీలతో మోతమోగిపోయింది. 166 పరుగుల లక్ష్యం కేవలం 9.4 ఓవర్లలోనే కరిగిపోయింది. దీంతో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో లక్నోను చిత్తుచేసి ప్లే ఆఫ్స్‌నకు మరింత చేరువైంది.
ఈ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్స్ స్పందిస్తూ, 'ట్రావిస్ హెడ్, అభిషేక్ తమ ఆటతో పిచ్ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశారు. వారి స్వేచ్ఛకు మేము అడ్డుచెప్పలేదు. ఆ ఇద్దరు ఆటగాళ్లుకు ఎంతో పాజిటివ్ దృక్పథం ఉంది. వారు ఎలా ఆడాలో, ఆడకూడదో ఒక బౌలర్‌గా నేను సలహాలు ఇవ్వలేను. హెడ్ గత రెండేళ్లుగా కష్టసాధ్యమైన పిచ్‌లపై విజృంభిస్తున్నాడు. విలువైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఇది సాధారణ విషయం కాదు.
అభిషేక్ శర్మ అద్భుత ఆటగాడు. స్పిన్, పేస్ ఏ బౌలింగ్‌లోనైనా ఆడగలడు. కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఔట్‌సైడ్ సర్కిల్‌లో ఉండే పవర్ ప్లే సమయంలో బౌలర్లు వీరిని ఎదుర్కోవడం కష్టంతో కూడుకున్న పని. వికెట్లు పడకుండా బ్యాటర్లు చెలరేగుతున్నప్పుడు నిజంగా వారు ఎన్ని పరుగులు సాధిస్తారని చెప్పడం కష్టమే. ఈ ఇద్దరు బ్యాటర్లకు ఇది అద్భుతమైన సీజన్‌గా చెప్పవచ్చు. 10 ఓవర్లలోపే మ్యాచ్‌ను ముగించడం.. నమ్మశక్యం కాని విధంగా ఉంది' అని కమిన్స్ అన్నాడు.