ఐపీఎల్ 2024లో మరి సరికొత్త రికార్డు నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో సినిమా ఐపీఎల్ ప్రసారాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో జియో సినిమా వేదికగా మ్యాచ్ వీక్షించిన వారి సంఖ్య 62 కోట్లకు చేరింది. గతేడాదిలో నమోదైన సంఖ్యతో పోలిస్తే ఈ యేడాది 53 శాతం పెరిగింది. తాజా సీజన్‌లో 35,000 కోట్ల నిమిషాల వాచ్‌టైంను నమోదు చేసింది.
ఐపీఎల్ సీజన్ మొదటి రోజున జరిగిన మ్యాచ్‌ను 11.3 కోట్ల మంది వీక్షించారు. గతేడాది మొదటి రోజు వ్యూయర్‌షిప్‌తో పోలిస్తే 51 శాతం వృద్ధి చెందింది. వీక్షకులు సెషన్‌కు సగటున 75 నిమిషాలు వెచ్చించారు. గతేడాదిలో ఈ సెషన్ సమయం 60 నిమిషాలుగా ఉంది. జియో సినిమా తన వీడియో క్వాలిటీని పెంచింది. 4కె వీడియో క్వాలిటీ, మల్టీ క్యామ్ ఆప్షన్స్, 12భాషల్లో ఫీడ్, ఏఆర్, వీఆర్ వంటి సదుపాయాలు తీసుకురావడం కూడా వ్యూయర్‌షిప్‌ను పెంచడంలో సాయపడ్డాయి.
2024 పారిస్ ఒలింపిక్స్‌ను తన వేదిక ద్వారా వీక్షించే సదుపాయాన్ని అందించాలని జియో సినిమా ప్లాన్ చేస్తోంది. గంట కొద్దీ లైవ్, ఆన్- డిమాండ్ కంటెంట్‌ను ఇవ్వాలని చూస్తోంది. 2024 జులై 26న ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 11వ తేదీన ముగింపు వేడుకలు జరగనున్నాయి.