పాకిస్తాన్ ముఖంపై విజయం వెక్కిరించి వెళ్లిపోయింది... సౌతాఫ్రికా చేతిలో ఓటమి, సెమీస్ నుంచి ఔట్?

శుక్రవారం, 27 అక్టోబరు 2023 (23:16 IST)
చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్ 2023 పోటీల్లో భాగంగా పాకిస్తాన్-దక్షిణాఫ్రికా జట్లు తలబడ్డాయి. చాలా సులభంగా గెలిస్తామన్న దక్షిణాఫ్రికాకి పాకిస్తాన్ బౌలర్లు చివర్లో చుక్కలు చూపించారు. దీనితో ఆఖరి క్షణాల వరకూ సస్పెన్స్ థ్రిల్లర్‌లా మ్యాచ్ మారిపోయింది. ఒక్క వికెట్ పడగొడితే పాకిస్తాన్ విజయం ఖాయమయ్యేది. కానీ దక్షిణాఫ్రికా బ్యాట్సమన్ కేశవ్ మహరాజ్ విజయానికి అవసరమైన నాలుగు పరుగులను ఒక్క ఫోర్ కొట్టడంతో దక్షిణాఫ్రికా జట్టు మొత్తం విజయం తాలూకూ తెచ్చిన గావు కేకలు పెట్టింది.
 
ఈ విజయం దక్షిణాఫ్రికాకి మామూలైనది కాదు. అలాగే పాకిస్తాన్ జట్టు గేటు దాకా వచ్చిన విజయం వెక్కిరించి వెళ్లిపోయింది. దీనితో దక్షిణాఫ్రికా ఒక వికెట్ తేడాతో పాక్ పైన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఎప్పటిలాగానే తడబాటు పడింది. ఓపెనర్లు రాణించకపోయినప్పటికీ మిడిలార్డర్ కాస్త లాగించారు. దానితో పాకిస్తాన్ 46.4 ఓవర్లకే ఆలౌటై 270 పరుగులు చేసింది.
 
ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు ధాటిగా ఆడారు. 33 ఓవర్లు గడిచేవరకూ దక్షిణాఫ్రికా విజయం నల్లేరుపై నడకే అనుకున్నారు. కానీ ఆ తర్వాత వరుస వికెట్లు పడిపోవడంతో విజయం క్లిష్టతరంగా మారినట్లు కనిపించింది. మ్యాచ్ పాకిస్తాన్ వైపుకి మొగ్గింది. ఐతే ఈ దశను పాకిస్తాన్ జట్టు సరిగా వినియోగించుకోలేకపోవడంతో ఆఖరి వికెట్ వద్ద కూడా దక్షిణాఫ్రికా బ్యాట్సమన్లు చక్కగా విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీస్ నుంచి నిష్క్రమించే పరిస్థితి వచ్చేసినట్లయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు