ఇకపై అన్నీ ఫార్మెట్లకు ఒకే కెప్టెన్.. అతనే కోహ్లీ : సౌరవ్ గంగూలీ

గురువారం, 24 అక్టోబరు 2019 (16:30 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త సారథిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఆయన భారత క్రికెట్‌ భవిష్యత్‌పై తన మనసులోని స్పందన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, అన్ని ఫార్మెట్లకు కలిపి ఒకే కెప్టెన్‌ సరిపోతాడని, వేర్వేరు ఫార్మెట్లకు వేర్వేరు కెప్టెన్లు అక్కర్లేదని చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, భారత జట్టుకు ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదన్నారు. అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీ కెప్టెన్సీ అద్భుతంగా ఉందన్నారు. కోహ్లీ జట్టును మరో స్థాయికి తీసుకెళ్లాడన్నారు. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ అనేక విజయాలు నమోదు చేసిందని గుర్తుచేశారు. 
 
స్వదేశంలో భారత్ వరుసగా 11 టెస్టు సరీస్‌లు గెలిచి, ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును చెరిపేశారు. విదేశాల్లో సైతం విజయాల శాతం చాలా మెరుగు పడిందని గంగూలీ తెలిపారు. కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా సైతం అతను అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లీనే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా కొనసాగుతాడని గంగూలీ స్పష్టం చేశారు. 
 
పైగా, కోహ్లీ జట్టులో చాలా ముఖ్యమైన ఆటగాడనీ, అతడి నిర్ణయాలను మేము గౌరవిస్తామన్నారు. ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌లో ఓడినప్పటి నుంచి కోహ్లీని టెస్టులకే పరిమితం చేయాలనీ, రోహిత్‌కు వన్డే, టీ 20 ఫార్మాట్లకు కెప్టెన్ బాధ్యతలు అప్పగించాలని అప్పట్లో దుమారం రేగిన విషయం తెలిసిందే. వీటికి తెరదించాలన్న ఉద్దేశ్యంతోనే గంగూలీ కెప్టెన్సీపై వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు