తునిలో మైనర్ బాలికపై 62 ఏళ్ల వృద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని డీఎస్పీ శ్రీహరి రాజు వెల్లడించారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై కిడ్నాప్, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసామన్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసామనీ, ఈ ఘటనకు పార్టీల ప్రమేయం లేదని చెప్పారు.
ఏ పార్టీ కూడా నిందితుడు నారాయణ రావును తమ వాడని క్లెయిమ్ చేయలేదు కనుక సోషల్ మీడియాలో పార్టీల మధ్య గొడవలు సృష్టించేందుకు వీడియోలు సర్క్యులేట్ చేస్తే చర్యలు తీసుకుంటాం. వాస్తవాలు తెలుసుకోకుండా ఉద్దేశ్యపూర్వకంగా ఆ వ్యక్తి ఫలానా పార్టీ వాడంటూ ప్రచారం చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
కాకినాడ జిల్లాలోలోని తుని బాలికను హాస్టల్ నుంచి తాటిక రామారావు అనే 62 ఏళ్ల వ్యక్తి సదరు బాలిక తాతయ్యను అంటూ ఆమెను బైటకు తీసుకుని వెళ్లి హంసవరం సపోటా తోటల్లో అత్యాచార యత్నం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. తుని రూరల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై తాటిక నారాయణ రావు ఈ అకృత్యానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.