ఐసీసీ చైర్మన్‌గా జై షా... బీసీసీఐ కొత్త సారథి ఎవరు?

ఠాగూర్

శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (13:28 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శిగా ఉన్న జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఎంపికయ్యారు. దీంతో బీసీసీఐ కొత్త కార్యదర్శిగా ఎవరు పగ్గాలు చేపడుతారన్న అంశంపై ఇపుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐసీసీ చీఫ్‌గా జై షా ఎంపికై వారం రోజులు గడుస్తున్నా బీసీసీఐ నూతన కార్యదర్శిగా ఎవరు ఎంపిక అవుతారు అనే దానిపై ఉత్కంఠ ఇంతవరకూ వీడలేదు. ఈ తరుణంలోనే బీసీసీఐ వార్షిక సమావేశం తేదీ ఖరారు అయింది. బెంగళూరు వేదికగా 93వ జనరల్ మీటింగ్ ఈ నెల 29వ తేదీన జరగనుంది.
 
ఈ సమావేశంలోనే బీసీసీఐ నూతన కార్యదర్శి ఎంపిక ఉంటుందనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే, అదేమి లేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ద్వారానే కొత్త సెక్రటరీ నియామకం జరుగుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలియజేయడంతో 29న జరిగే సమావేశంలో కొత్త సెక్రటరీ నియామకం ఉండదని తేలిపోయింది. 
 
అయితే ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చ నిర్వహిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ చిన్ని ఐసీసీలో ఇకపై బీసీసీఐ తరపున ప్రతినిధిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్ లో బీసీసీఐ ప్రతినిధిగా ఒకరిని ఎంపిక చేయడం, వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో పాటు అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే, బీసీసీఐ కొత్త కార్యదర్శిగా రోహాన్ జైట్లీ ఎంపిక కావొచ్చంటూ ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు