కివీస్ గడ్డపై 41 సంవత్సరాల తర్వాత టీం ఇండియా సృష్టించిన రికార్డు, భారతీయులందరి మద్దతుతో లభించిందని భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. టీం ఇండియా ఆటగాళ్ల సమిష్టి కృషితో కివీస్‌పై ధీటుగా రాణించగలిగామని సచిన్ చెప్పాడు. కివీస్ టెస్టు పర్యటనను ముగించుకుని ధోనీ సేన గురువారం స్వదేశానికి చేరుకుంది.
ధోనీతో పాటు ఐదుగురు క్రికెటర్లు ఢిల్లీకి చేరుకోగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో పాటు జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, ధావెల్ కుల్‌కర్ణిల ముంబై ఎయిర్‌పోర్టులో దిగారు.
ఇంకా వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్‌లు కూడా తమ స్వస్థలాలకు చేరుకున్నట్లు క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. కివీస్‌పై తమ జట్టు ఆటగాళ్లు మెరుగ్గా ఆడటం ఆనందంగా ఉందని, ఈ విజయం ప్రతి ఒక్కరిదని సచిన్ అన్నాడు.