ఆసిస్‌లో బ్రెట్‌లీ, సైమండ్స్‌కు స్థానం

పేస్ బౌలర్ బ్రెట్‌లీ, ఆల్ రౌండర్‌ ఆండ్ర్యూ సైమండ్స్ తిరిగి ఆస్ట్రేలియా జట్టులో చోటుదక్కించుకున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఏప్రిల్ 22న ప్రారంభమయ్యే పాకిస్థాన్- ఆసీస్ వన్డే సిరీస్‌కు తమ జట్టును బుధవారం ప్రకటించింది. ఈ సిరీస్ మ్యాచ్‌‍లకు దుబాయ్, అబుదాబి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

గాయంతో జట్టుకు దూరమైన బ్రెట్‌లీ తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే క్రికెట్ ఆస్ట్రేలియా సెలెక్షన్ కమిటీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు విశ్రాంతి కల్పించింది. మిచెల్ జాన్సన్, ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న మైకెల్ హసీలకు కూడా పాకిస్థాన్ వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన 14 మంది సభ్యుల బృందంలో చోటు లభించలేదు.

యాషెస్, జూన్‌లో ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇచ్చే ట్వంటీ- 20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని పాంటింగ్, హసీ, జాన్సల్‌లకు క్రికెట్ ఆస్ట్రేలియా విశ్రాంతినిచ్చింది. పాకిస్థాన్‌తో జరిగే ఐదు వన్డేలు, ఒక ట్వంటీ- 20 మ్యాచ్‌కు మైకెల్ క్లార్క్ నేతృత్వం వహిస్తాడు. ఏప్రిల్ 22 నుంచి మే 7 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. బ్రాడ్ హాడిన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

ఆస్ట్రేలియా జట్టు: మైకెల్ క్లార్క్ (కెప్టెన్), బ్రాడ్ హాడిన్ (వైస్- కెప్టెన్), నాథన్ బ్రాకెన్, కలమ్ పెర్గ్యూసన్, బ్రెట్ గ్రీవెస్, నాథన్ హారిడ్జ్, బెన్ హిల్‌ఫెన్‌హాస్, జేమ్స్ హోప్స్, డేవిడ్ హసీ, బెన్ లాఫ్‌లిన్, బ్రెట్‌లీ, షాన్ మార్ష్, ఆండ్ర్యూ సైమండ్స్, షేన్ వాట్సన్.

వెబ్దునియా పై చదవండి