ఐపీఎల్ నిర్ణయంపై "మాస్టర్ బ్లాస్టర్" అసంతృప్తి

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఇతర దేశాలకు తరలి పోవడం పట్ల మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో టోర్నీని ఇంగ్లండ్‌‌లో నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) వర్కింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఐపీఎల్ నిర్ణయంపై సచిన్‌ స్పందిస్తూ.. విదేశాల్లో కంటే సొంత ప్రేక్షకుల మధ్య ఆడితేనే తమకు బాగుంటుందని సచిన్‌ అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్‌ వంటి టోర్నీలు భారత్‌లోనే జరిగితే బాగుంటుందని, స్వదేశంలో జరిగే మ్యాచ్‌లకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు. గత యేడాది జరిగిన తొలి సీజన్ పోటీలు సక్సెస్ అయిన విషయం తెల్సిందే. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీని విదేశాలకు తరలించాలని నిర్ణయించడం పట్ల దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి