ఐసీసీ ట్వంటీ-20 టైటిల్ పాకిస్థాన్‌కే..!: సల్మాన్ భట్

FILE
కరేబియన్ గడ్డపై ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచకప్ ట్వంటీ-20 ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకునే దిశగా పాకిస్థాన్ జట్టు పోరాడుతుందని ఆ జట్టు ఓపెనర్ సల్మాన్ భట్ నమ్మకం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌‌లో జరిగే ఐసీసీ వరల్డ్ కప్‌లో తమ జట్టును గెలిపించేందుకు ప్రతి ఒక్క ఆటగాడూ తన వంతు కృషి చేస్తాడని సల్మాన్ భట్ స్పష్టం చేశాడు.

ఐసీసీ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో గ్రూప్‌ను పంచుకునే పాకిస్థాన్ తప్పకుండా ఆ జట్టుపై గట్టిపోటీని ప్రదర్శించేందుకు తీవ్రంగా కృషి చేస్తుందని సల్మాన్ భట్ చెప్పాడు. పాకిస్థాన్‌ జట్టుకు రెండో సారి ప్రపంచకప్ ట్వంటీ-20 టైటిల్‌ను సంపాదించిపెట్టడంలో ప్రతి ఆటగాడు వందశాతం ఆటతీరును మైదానంలో కనబరుస్తాడని సల్మాన్ భట్ ధీమా వ్యక్తం చేసినట్లు డాన్ పత్రిక వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ పరాభవం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో పాక్ క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు యూనిస్ ఖాన్, షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్ వంటి ఆటగాళ్లపై నిషేధం వేటు వేసింది.

ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌లో జరిగే ట్వంటీ-20లో గత ఏడాది వరల్డ్ కప్ ఛాంపియన్ పాకిస్థాన్ మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తుందని సల్మాన్ భట్ నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి