కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు "ఐకాన్" క్రికెటర్, టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్, ఐపీఎల్ నాలుగో సీజన్‌ను వేరొక జట్టు తరపున ఆడుతాడని వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తన సంబంధాన్ని తెగతెంపులు చేసుకోవడానికి యువరాజ్ సింగ్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌లో యువరాజ్ సింగ్, కొత్తగా ఎంపికైన ఫ్రాంచైజీ జట్టులోనో? లేదా ప్రస్తుతమున్న వేరేదేని ఐపీఎల్ జట్టులోనో ఆడే అవకాశం ఉందని తెలిసింది. ఇంకా ఐపీఎల్-4 కొత్త నిబంధనల ప్రకటనకు అనంతరం తన ఐపీఎల్ భవిష్యత్తుపై సరైన నిర్ణయం తీసుకుంటానని యువరాజ్ సింగ్ ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే.. ఐపీఎల్-3 సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంపై యువరాజ్ సింగ్ మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఇంకా ఈ వ్యవహారమై యువరాజ్‌కు పంజాబ్ జట్టు యాజమాన్యానికి మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం.
అలాగే కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఐపీఎల్ తొలి సీజన్లలో కెప్టెన్సీ సారథ్యం వహించిన యువరాజ్ సింగ్‌ను, మూడో సీజన్‌లో జట్టుకు కెప్టెన్సీ సారథ్యం నుంచి తప్పించడంపై ఇంకా ఎలాంటి కారణం తెలియరాలేదు.
అయితే జట్టు యజమాని నెస్ వాడియా చేసిన వ్యాఖ్యలతోనే యువరాజ్ సింగ్, ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సన్నిహిత వర్గాల సమాచారం. వాడియా ఒకసారి యువీ సారథ్యంలోని పంజాబ్ టీమ్ గురించి మాట్లాడుతూ.. "ఐకాన్" క్రికెటర్ అనే హోదా అన్ని జట్లతో సరితూగలేదని వ్యాఖ్యానించడం గమనార్హం.