కివీస్‌తో పోటీకి సిద్ధం : లక్ష్మణ్

సొంత గడ్డమీద న్యూజిలాండ్‌ను ఓడించటం కష్టమైనప్పటికీ... దాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు హైదరాబాదీ స్టార్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు.

ఈ విషయమై లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ... ఫార్మాట్ ఏదైనప్పటికీ కివీస్‌లో టీం ఇండియాకు గట్టిపోటీ ఎదురవక తప్పకపోయినా, విజయం మాత్రం టీం ఇండియాదేననీ ధీమా వ్యక్తం చేశాడు. టెస్ట్ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, తన వంతు కర్తవ్యంగా.. మ్యాచ్‌ను గెలిపించే ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటున్నట్లు ఆయన వ్యాఖ్యానించాడు.

ఇటీవలి కాలంలో టీం ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతోందని, రెట్టించిన ఆత్మవిశ్వాసంతో విదేశీ వికెట్లపైనా మెరుగ్గా రాణిస్తోందని లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశాడు. కివీస్‌లో 2002 సిరీస్‌తో పోలిస్తే ఇప్పుడు అక్కడి పరిస్థితులపై తామందరం సరైన అవగాహనను కలిగి ఉన్నామని వివరించాడు.

ఇదిలా ఉంటే... కివీస్ పర్యటనలో కొత్తగా మార్చిన టీం ఇండియా దుస్తుల రంగు, డిజైన్ చాలా బాగున్నాయని లక్ష్మణ్ తెలిపాడు. ఎంటర్‌టైన్‌మెంట్ అందించే క్రికెట్లో ప్రేక్షకులు కూడా తమ దుస్తుల రంగు ఆస్వాదిస్తారని, మెచ్చుకుంటారని ఈ హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మెన్ వెల్లడించాడు.

వెబ్దునియా పై చదవండి