కోచ్‌గా ఫ్లవర్: మద్దతు పలికిన స్ట్రాస్, కేపీ

ఇంగ్లాండ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ క్రికెటర్ల ఆండీ ప్లవర్ పేరును ఆ జట్టు కెప్టెన్ ఆండ్ర్యూ స్ట్రాస్, ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ ప్రతిపాదించారు. శాశ్విత ప్రాతిపదికన ఇంగ్లాండ్ కోచ్ బాధ్యతలను ఆండీ ప్లవర్‌కు అప్పగించేందుకు వీరిద్దరూ మద్దతు పలికారు. మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌తో బహిరంగ మాటల యుద్ధం అనంతరం ఇంగ్లాండ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న పీటర్ మూర్స్ స్థానంలో ఆండీ ప్లవర్ తాత్కాలికంగా ఆ బాధ్యతలు చేపట్టారు.

అయితే ఆండీ ప్లవర్ కోచ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి టెస్ట్ సిరీస్‌లోనే ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్‌పై 0-1 తేడాతో పరాజయం పాలైంది. అయితే వెస్టిండీస్ పర్యటనలో తరువాత జరిగిన వన్డే సిరీస్‌ను ఇంగ్లాండ్ జట్టు 3-2తో గెలుచుకుంది. ఈ విజయం ఆండీ ప్లవర్ (40) కోచింగ్ సామర్థ్యంపై సందేహాలను తొలగించింది. తాజాగా ఆండీ ప్లవర్‌ను శాశ్విత కోచ్‌గా నియమించేందుకు ఇంగ్లాండ్ కెప్టెన్ స్ట్రాస్ మద్దతు ఇచ్చాడు.

వెస్టిండీస్ టూర్‌లో ఆండీ ప్లవర్‌తో కలిసి బాగా పనిచేశాను. ఆయన సాయం ఎంతో ఉపయోగపడిందని, మా బంధం కొనసాగుతుందని భావిస్తున్నట్లు చెప్పాడు. అయితే ఇది నిర్ణయం మాత్రం కాదని వ్యాఖ్యానించాడు. శాశ్విత కోచ్ ఎంపికలో సెలెక్టర్లు తన అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నాను. అయితే కొన్నిసార్లు తీసుకోకపోవచ్చని స్ట్రాస్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

వెబ్దునియా పై చదవండి