గంభీర్ సెంచరీ: భారత్‌కు భారీ ఆధిక్యం

న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఓపెనర్ గౌతం గంభీర్ మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. వ్యక్తిగతంగా 167 పరుగుల భారీ స్కోరు చేయడంతో భారత్ ఇప్పటికే 500 పైచిలుకు పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. గంభీర్‌కు తోడు ద్రావిడ్ (60), లక్ష్మణ్ (61)లు రాణించడంతో భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. క్రీజ్‌లో కెప్టెన్ ధోనీ (11), యువరాజ్ సింగ్ (2)లు ఉన్నారు.

అంతకుముందు 51 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ జట్టులో ఓపెనర్ గంభీర్, ద్రావిడ్‌లు నింపాదిగా ఆడుతూ, వికెట్ పడకుండా జాగ్రత్త వహించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 170 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ సమయంలో ద్రావిడ్ (60) పరుగుల వద్ద అవుట్ కావడంతో క్రీజ్‌లోకి వచ్చిన సచిన్ తొమ్మిది పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో భారత్ 208 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.

సచిన్ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లక్ష్మణ్ అర్థ సెంచరీతో రాణించి, గంభీర్‌తో కలిసి జట్టు స్కోరును 300 మార్క్‌ను దాటించాడు. ఈ క్రమంలో గంభీర్ 167 వద్ద, లక్ష్మణ్ 61 వద్ద అవుట్ కావడంతో నాలుగు, ఐదు వికెట్లు నాలుగు పరుగుల తేడాతో పడ్డాయి. కివీస్ బౌలర్లలో ఓబ్రియాన్, వెటోరీలు రెండేసి వికెట్లు తీయగా, మార్టిన్ ఒక వికెట్ తీశాడు.

వెబ్దునియా పై చదవండి