టీం ఇండియా నెట్ ప్రాక్టీస్‌కు వర్షం అడ్డు

ప్రారంభంలోనే చల్లటి చినుకులతో న్యూజిలాండ్‌లోకి స్వాగతం చెప్పిన వరుణదేవుడు... టీం ఇండియా నెట్ ప్రాక్టీస్‌కు పదే పదే అడ్డుపడుతున్నాడు. కివీస్ పరిస్థితులకు అలవాటు పడేందుకు టీం ఇండియాకు నెట్ ప్రాక్టీస్ చాలా అవసరం కాగా.. సోమవారం ఉదయం కూడా టీం ఇండియా నెట్ ప్రాక్టీసు వాన కారణంగా నిలిచిపోయింది.

అయితే ఈ సమయం వృథా కాకుండా టీం ఇండియా ఆటగాళ్లు... క్రైస్ట్‌చర్చ్‌లోని లింకోల్ యూనివర్శిటీలో ఉన్న హై ఫర్‌ఫామన్స్ ఇండోర్ స్టేడియంలో నెట్‌ ప్రాక్టీసు చేశారు. ఈ స్టేడియంలో ఆటగాళ్లందరూ శారీరక, మానసిక ఫిటినెస్ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే జట్టు ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్ కొంతమంది ఆటగాళ్ల చేత ఫీల్డింగ్ డ్రిల్స్ చేయించగా, మరికొంత మంది ఆటగాళ్లు పాడీ ఉప్టోన్ నేతృత్వంలో షాడో బాక్సింగ్ ప్రాక్టీసు చేశారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్‌లు ఏరోబిక్స్‌పై దృష్టిసారించారు.

ఈ సందర్భంగా జహీర్ ఖాన్ మాట్లాడుతూ... సిరీస్ ప్రారంభం కోసం తమ బృందమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందని అన్నాడు. టీం ఇండియా అన్ని రకాలుగా పటిష్టమైన స్థితిలో ఉందనీ, ఖచ్చితంగా విజయం సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.

వెబ్దునియా పై చదవండి