ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా.. డెక్కన్ ఛార్జర్స్-ముంబై ఇండియన్స్‌ల మధ్య సమరం జరుగనుంది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి చవిచూసిన డెక్కన్ ఛార్జర్స్ ఆదివారం జరిగే కీలక మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది. యూసుఫ్ పఠాన్ విధ్వంసకర బ్యాటింగ్‌కు తలొగ్గిన ఛార్జర్స్ ఈ మ్యాచ్‌లో మాత్రం విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.
ఇకపోతే.. కెప్టెన్ గిల్‌క్రిస్ట్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కిందటి సీజన్‌లో ఒంటి చేత్తో జట్టుకు ట్రోఫీని సాధించి పెట్టిన గిల్‌క్రిస్ట్ ఈసారి గట్టిపోటీని ప్రదర్శించడంలో విఫలమవుతున్నాడు. అలాగే సీనియర్ బ్యాట్స్‌మన్ లక్ష్మణ్, గిబ్స్, సైమండ్స్‌లు కూడా ఒక్క భారీ ఇన్నింగ్స్‌ను ఆడలేదు. ఒకవేళ సుమన్, వేణుగోపాల్‌రావు, వాస్‌లు కూడా బ్యాట్ ఝుళిపిస్తే జట్టు సమస్య తీరుతోంది.
మరోవైపు బౌలింగ్ విభాగంలో కూడా డెక్కన్ ఛార్జర్స్ పటిష్టంగా లేదు. ఆర్పీ సింగ్, ఓజాల వైఫల్యం జట్టును బాధిస్తోంది. దక్షిణాఫ్రికా గడ్డపై మెరిసిన ఆర్పీ ఈసారి మాత్రం రాణించలేకపోతున్నాడు. ఐదు మ్యాచుల్లో కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టి నిరాశ పరిచాడు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ మూడో సీజన్‌లో కేవలం ఒక్క ఓటమితో విజయాల పరంపరను కొనసాగిస్తోన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సేన ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి ఐపీఎల్ జాబితాలో అగ్రస్థానంలోనే కొనసాగాలనే తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎంతో పటిష్టంగా ఉన్న ముంబయి ఈ మ్యాచ్‌లోనూ విజయమే లక్ష్యంగా ఉంది.
సచిన్ నాయకత్వం వహించే ముంబై ఇండియన్స్ జట్టు సౌరవ్ తివారీ, పొలార్డ్, బ్రేవో, తారె, రాయుడు, శిఖర్ ధావన్, సతీష్‌లతో కూడిన లైనప్ ప్రత్యర్థులకు గండి కొట్టేలా ఉంది. అలాగే జహీర్, హర్భజన్, మలింగల పటిష్టమైన బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.