తమ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలీస్‌ను తొలి వన్డేకు దూరంగా ఉంచి, విశ్రాంతి కల్పిస్తున్నట్టు క్రికెట్ దక్షిణాఫ్రికా యాజమాన్యం ప్రకటించింది. గజ్జల్లో గాయంతో బాధపడుతూ వచ్చిన కలీస్.. ప్రస్తుతం కోలుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డేకు కలీస్ అందుబాటులో ఉంటాడని తొలుత ప్రకటించింది. అయితే, కలీస్ కోలుకున్నప్పటికీ, మరికొంత విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆ జట్టు మేనేజ్మెంట్ వెల్లడించింది.
డర్బన్‌లో శుక్రవారం జరిగే తొలి వన్డేకు జాక్వెస్ కలీస్ ఆడటం లేదని జట్టు కెప్టెన్ స్మిత్ వెల్లడించారు. కెప్టెన్ స్మిత్ గాయంతో దూరం కావడంతో కేప్‌టౌన్ టెస్టుకు కలీస్ నాయకత్వం వహించగా, ఈ టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. ఈ టెస్టులో బౌలింగ్ చేస్తున్న సమయంలో కలీస్‌కు గజ్జల్లో గాయమైంది.
అలాగే, చిటికెన వేలు గాయంతో చివరి టెస్టుతో పాటు రెండు ట్వంటీ-20 మ్యాచ్‌లకు కూడా కెప్టెన్ స్మిత్ దూరమయ్యాడు. ప్రస్తుతం స్మిత్ కోలుకోగా, కలీస్ గాయం బారిన పడ్డారు. దీంతో 33 సంవత్సరాల స్టార్ ఆల్‌రౌండర్ సేవలు జట్టుకు తాత్కాలికంగా దూరమయ్యాయి.