దేనికైనా రె'ఢీ' : కిర్‌స్టెన్‌

న్యూజిలాండ్ పర్యటనలో ఎలాంటి సవాళ్లకైనా 'ఢీ'కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని భారత క్రికెట్ జట్టు కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ధీమా వ్యక్తం చేశాడు. కివీస్ పరిస్థితులకు టీం ఇండియా త్వరగానే అలవాటు పడుతుందని అన్నాడు.

కివీస్‌తో పోటీకి ఎలాంటి ఇబ్బందీ లేదనీ... అయితే వారితో ఎలా తలపడాలన్న విషయంలో ప్రణాళికలు చేస్తున్నామనీ, అందుకు అనుగుణంగానే జట్టు ఆడుతుందని కిర్‌స్టెన్ పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ప్రతిచోటా పిచ్‌లు వేరువేరుగా ఉంటాయనీ... అందులో కివీస్ కూడా ఒకటని ఆయన చెప్పాడు. అంతేగాకుండా, ఎక్కడైనప్పటికీ.. ఏ రెండు పిచ్‌లూ ఒకేమాదిరిగా ఉండబోవని అన్నాడు.

అయితే ఇలాంటి వాటిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ.. పరిస్థితులకు అలవాటు పడటం అలవర్చుకుంటే సరిపోతుందని కిర్‌స్టెన్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం టీం ఇండియా సమతుల్యంగా ఉందనీ.. సీమర్లు బాగా బౌలింగ్ చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేశాడు.

కివీస్ పిచ్‌లపై ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారుగానీ... అవేవీ అంతగా భయపెట్టేలాగా లేవని కిర్‌స్టెన్ అభిప్రాయపడ్డాడు. కొంతకాలంగా వరుస విజయాలు సాధిస్తున్న టీం ఇండియా, స్వదేశంలోనూ మేటి జట్టుగా నిరూపించుకుందని చెప్పాడు. అయితే విదేశాల్లో కూడా తన సత్తాను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందనీ, టీం ఇండియా తప్పకుండా విజయం సాధిస్తున్న కిర్‌స్టెన్ ఆత్మవిశ్వాసంతో అన్నాడు.

గత వైఫల్యంపై కిర్‌స్టెన్ మాట్లాడుతూ... గత పర్యటనంటే అది 2002-03 సంగత మాటని, అది జరిగి ఆరేడేళ్లవుతోంది. అప్పటి వైఫల్యంపై.. అప్పుడేం జరిగిందన్న విషయాలపై తాము సమావేశాల్లో అసలు చర్చించనే లేదనీ స్పష్టం చేశాడు. ఆ విషయంపై తమకెలాంటి దిగుల్లేదనీ... ప్రస్తుతం తమ దృష్టంతా ఆటపైన, భవిష్యత్ సిరీస్‌లపైనేనని.. సమిష్టి ప్రదర్శనతో చెలరేగుతామని అన్నాడు.

వెబ్దునియా పై చదవండి