ద్రావిడ్, ఊతప్పల సూపర్ ఇన్నింగ్స్: బెంగళూరు ఘనవిజయం!

FILE
టీం ఇండియా మాజీ కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు రాహుల్ ద్రావిడ్ చెప్పిన మాటను నిలబెట్టుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాలంటే.. ఇకపై జరిగే మ్యాచ్‌ల్లో మళ్లీ పుంజుకుంటామని తెలిపిన రాహుల్ ద్రావిడ్ శనివారం జరిగిన మ్యాచ్‌లో జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా ద్రావిడ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించే.. బాలీవుడ్ బాద్‌షా ఫ్రాంచైజీ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన 43వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో ద్రావిడ్ ఇన్నింగ్స్‌కు ఊతప్ప మెరుపు ఇన్నింగ్స్ తోడుకావడంతో బెంగళూరు విజయాన్ని నమోదు చేసుకుంది.

161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూర్‌ ప్రారంభంలోనే కలిస్‌(8) వికెట్‌కు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్‌ శ్రీరాం (27)తో కలిసి ద్రావిడ్‌ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరిద్దరి భాగస్వామ్యంతో జట్టు వంద పరుగులపై చిలుకును దాటింది. శ్రీరాం 3ఫోర్లతో 27 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. మరోవైపు రాహుల్ ద్రావిడ్ 35 బంతుల్లో 5ఫోర్లు, రెండు సిక్స్‌లతో అర్థసెంచరీని నమోదు చేసుకున్నాడు.

తర్వాత బరిలోకి దిగిన ఊతప్ప ఫోర్లు, సిక్స్‌లతో కోల్‌కతా బౌలర్లను హడలెత్తించాడు. సూపర్ ఇన్నింగ్స్ ఆడిన ఊతప్ప 22 బంతుల్లోనే ఐదు సిక్స్‌లు, 3 ఫోర్లతో 52 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో టేలర్‌ (14 నాటౌట్‌)తో కలిసి 4వ వికెట్‌కు అజేయంగా 62 పరుగులు జోడించాడు.

అంతకుముందు కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 160 పరుగులు సాధించింది. ఇకపోతే.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ వినయ్ కుమార్ విజృంభించి మూడు వికెట్లు పడగొట్టడంతో అతనికి మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ దక్కింది.

వెబ్దునియా పై చదవండి