నాలుగు దశాబ్దాల చరిత్రను తిరగరాయాలనే గట్టి పట్టుదలతో కివీస్ గడ్డపై అడుగుపెట్టిన ట్వంటీ-20 ప్రపంచ ఛాంపియన్ భారత జట్టు తొలి వన్డే మ్యాచ్‌ను బుధవారం ఆడనుంది. కోటి ఆశలతో న్యూజిలాండ్‌కు చేరుకున్న ధోనీ సేన సవాల్‌ను స్వీకరించేందుకు సమయాత్తమైంది. 47 రోజుల సుదీర్ఘ పర్యటనలో భాగంగా భారత జట్టు తొలి మ్యాచ్ క్రెస్ట్‌చర్చ్‌లో జరుగనుంది.
ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించేందుకు ఇరు జట్లు సర్వశక్తులను ఒడ్డి పోరాడనున్నాయి. శ్రీలంక పర్యటనలో ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న ధోనీ సేన, అంతకుముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లను కూడా కైవసం చేసుకుని మంచి ఊపు మీద ఉన్న విషయం తెల్సిందే. ఇలా వరుస విజయాలతో ఉరకలు వేస్తున్న భారత జట్టు కివీస్‌ను ఖంగుతినిపించడం ఖాయమని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, గాయం కారణంగా లంక పర్యటనకు దూరమైన భారత టర్బోనేటర్ హర్భజన్ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక న్యూజిలాండ్ బలాబలాలను పరిశీలిస్తే.. గత కొంత కాలంగా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న, జాకబ్ ఓరమ్ తిరిగి జట్టులోకి రావడంతో ఆ జట్టు బ్యాటింగ్‌ను ఆర్డర్ పటిష్టం చేసింది. మొత్తం మీద ఇరు జట్లలో యువరక్తం ఉరకలు వేస్తుండటంతో ఈ పోరు హోరాహోరీగా జరుగనుంది.