నేపియర్ టెస్ట్: గంభీర్ సెంచరీ.. సచిన్ రాణింపు

నేపియర్‌లో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు‌లో ఓపెనర్ గౌతంగంభీర్ (102 నాటౌట్) సెంచరీ భారత జట్టును ఆదుకున్నాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగుల వెనుకబడి ఫాలోఆన్ ఆడుతున్న భారత్ కోలుకుంది. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో భారత్ తడబడినా గంభీర్ సెంచరీతో, రాహుల్ ద్రావిడ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్, సచిన్ టెండూల్కర్ అర్థ సెంచరీతో రాణించడంతో నాలుగురోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.

మరో ఆట మాత్రమే మిగిలి వుండగా, భారత్ మరో 62 పరుగుల వెనుకబడి వుంది. గంభీర్ (102), సచిన్ (58)లు క్రీజులో ఉన్నారు. ఇంకా ఒక్కరోజు ఆట మాత్రమే మిగిలిఉన్న నేపథ్యంలో చివరి రోజు అనూహ్య పరిణామాలేవీ సంభవించకపోతే ఈ టెస్టు డ్రా అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి. అంతకుముందు ఓ వికెట్ నష్టానికి 47 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగోరోజు ఆట కొనసాగించిన భారత్‌ 163 పరుగులవద్ద ద్రావిడ్ (62) వికెట్‌ను మాత్రమే కోల్పోయింది. ద్రావిడ్ తర్వాత గంభీర్‌కు సచిన్ జతకలిశాడు.

వీరిద్దరు వికెట్లు కాపాడుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో భారత జట్టు నాలుగో రోజంతా ఆడినప్పటికీ కేవలం 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 619 పరుగుల భారీస్కోరు చేసి డిక్లెర్ చేసిన సంగతి తెలిసిందే. బదులుగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 305 పరుగులకే ఆలౌట్ కావడంతో ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది.

వెబ్దునియా పై చదవండి