పాక్ మాజీ బ్యాట్స్‌మన్ ఇజాజ్ అరెస్ట్

భారీ మొత్తంతో కూడిన నకిలీ చెక్ లీఫ్‌ను అందజేసిన ఫోర్జరీ కేసులో మాజీ పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఇజాజ్ అహ్మద్‌కు 14 రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉంచాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ ఇజాజ్ దాఖలు చేసిన పిటిషన్‌ను లాహోర్ కోర్టు శనివారం కొట్టి పారేసింది. దీంతో పాటు ఇజాజ్‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది

నకిలీ చెక్ లీఫ్‌ను అందజేసిన కేసులో తనకు బెయిల్ కావాలని కోరుతూ ఇజాజ్ అహ్మద్ దాఖలు చేసిన పిటిషన్‌పై లాహోర్ కోర్టు శనివారం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై వాదనలను విన్న మేజిస్ట్రేట్ మహమ్మద్ యూనిస్ అవాన్, ఇజాజ్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు.

దీంతో పాటు 1.30 మిలియన్ డాలర్లు (10.05 మిలియన్ రూపాయలు) విలువగల నకిలీ చెక్‌లను అందజేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజాజ్‌ను 14 రోజుల పోలీసు కస్టడీలో ఉంచాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు ఇజాజ్ ఆస్మాతో బాధపడుతున్న కారణంగా అతనికి సరైన వైద్య సదుపాయాలను అందించాల్సిందిగా మేజిస్ట్రేట్ పోలీసు శాఖకు ఆదేశించారు.

ఈ 40 ఏళ్ల ఇజాజ్ తన క్రికెట్ కెరీర్‌లో (1987-2001) 60 టెస్టులతో పాటు 250 వన్డేలను ఆడాడు. అంతేగాకుండా 1992 సంవత్సరంలో పాకిస్తాన్ వరల్డ్ కప్ సాధించడంలోనూ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుచే జాతీయ క్రికెట్ అకాడమీకి ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి